భారతీయ రైల్వేల్లో ప్రయాణికులు ఉచిత లగేజీ లిమిట్‌కు మించి తీసుకెళ్తే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్‌సభలో స్పష్టం చేశారు.
డిసెంబర్ 17, 2025న లోక్‌సభలో తెలుగుదేశం పార్టీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశ్నకు వ్రాతపూర్వక సమాధానంలో మంత్రి ఈ వివరాలు తెలిపారు.
మంత్రి తెలిపిన సమాచారం ప్రకారం ఉచిత లగేజీ లిమిట్లు, గరిష్ట లిమిట్లు (క్లాస్వైజ్)
సెకండ్ క్లాస్: ఉచితం 35 కేజీలు, గరిష్టం 70 కేజీలు
స్లీపర్ క్లాస్ : ఉచితం 40 కేజీలు, గరిష్టం 80 కేజీలు
ఏసీ 3 టైర్ / చైర్ కార్ : ఉచితం 40 కేజీలు, గరిష్టం 40 కేజీలు (అదనపు అనుమతి లేదు)
ఫస్ట్ క్లాస్ / ఏసీ 2 టైర్ : ఉచితం 50 కేజీలు, గరిష్టం 100 కేజీలు
ఏసీ ఫస్ట్ క్లాస్ : ఉచితం 70 కేజీలు, గరిష్టం 150 కేజీలు
ఉచిత లిమిట్‌కు మించి గరిష్ట లిమిట్ వరకు తీసుకెళ్తే లగేజీ రేటు కంటే 1.5 రెట్లు ఛార్జీలు చెల్లించాలి. గరిష్ట లిమిట్ మించితే బ్రేక్ వాన్ (SLR) లేదా పార్శిల్ వాన్లో బుక్ చేయాలి.
ట్రంక్లు, సూట్‌కేస్‌లు, బాక్స్‌లు బయటి కొలతలు 100 cm x 60 cm x 25 cm (లెంగ్త్ x బ్రెడ్త్ x హైట్) మించితే ప్యాసెంజర్ కంపార్ట్మెంట్లో తీసుకెళ్లకూడదు. బ్రేక్ వాన్లో బుక్ చేయాలి. వ్యాపార బాగేజీ పర్సనల్ లగేజీగా కంపార్ట్మెంట్లో అనుమతి లేదు. అయితే ఇవి పాత నిబంధనలే.
ఎయిర్‌పోర్టు మాదిరిగా రైల్వేల్లో కఠిన లగేజీ చెకింగ్, వెయిటింగ్ మెషిన్లు, అదనపు ఛార్జీలు వస్తున్నాయనే ప్రచారాలు గత కొన్ని నెలలుగా జరుగుతున్నాయి. మంత్రి ఈ నియమాలు ఇప్పటికే ఉన్నవే అని స్పష్టం చేసి, కొత్త పాలసీ లేదని తెలిపారు. ఈ నియమాలు ప్రయాణికుల సౌకర్యం, రైలు భద్రత, కంపార్ట్మెంట్లో ఓవర్లోడింగ్ నివారణ కోసమే అమలవుతున్నాయి. ప్రయాణికులు తమ టికెట్ క్లాస్‌కు తగిన లగేజీ లిమిట్లు గుర్తుంచుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు.


































