140 ఏళ్లుగా చెక్కుచెదరని శరీరం; సైన్స్‌కు, విశ్వాసానికి అందని ప్రశ్న; అద్భుతం సెయింట్ బెర్నాడెట్

140 ఏళ్లు గడిచినా ఒక శరీరం కుళ్లిపోకుండా ఉంటుందంటే మీరు నమ్మగలరా? ఫ్రాన్స్‌లోని లూర్దు (Lourdes) నగరంలో సరిగ్గా ఇదే జరిగింది. ఈ అద్భుతం మరెవరిదో కాదు, సెయింట్ బెర్నాడెట్ అనే క్రైస్తవ సన్యాసినిది.


బాల్యం మరియు పేదరికం

మారి బెర్నార్డ్ సౌబిరస్ 1844 జనవరి 7న ఫ్రాన్స్‌లోని లూర్దులో ఒక పేద రైతు కుటుంబంలో జన్మించారు. ఆమె ఆరుగురు పిల్లలలో పెద్దది. చిన్నగా ఉండటం వల్ల ఆమెను అందరూ ‘బెర్నాడెట్’ అని పిలిచేవారు. తీవ్రమైన పేదరికం, పౌష్టికాహార లోపం వల్ల ఆమె అనారోగ్యంతో బాధపడేది. తన పన్నెండవ ఏట ఆమె గొర్రెల కాపరిగా పనికి వెళ్లింది. గొర్రెలను కాస్తున్న సమయంలో ఆమె ఒంటరిగా జపమాల (Rosary) చదువుకుంటూ ప్రశాంతతను వెతుక్కునేది. చిన్నప్పటి నుండి ఆమె ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నా, ఎప్పుడూ చిరునవ్వుతో ఉండేది.

ఆ అద్భుత దర్శనాలు

14 ఏళ్ల వయసులో, 1858 ఫిబ్రవరి 11న బెర్నాడెట్ తన స్నేహితులతో కలిసి కట్టెల కోసం వెళ్ళినప్పుడు, మసబీల్ అనే గుహ (Grotto) దగ్గర ఒక అద్భుతాన్ని చూసింది. ఒక ప్రకాశవంతమైన వెలుగులో తెల్లటి వస్త్రం, నడుముకు నీలిరంగు దట్టి ధరించిన ఒక సుందరమైన స్త్రీ ఆమెకు కనిపించింది. ఆమె పాదాల వద్ద పసుపు రంగు రోజా పువ్వులు ఉన్నాయి. ఆ స్త్రీ ‘కన్య మేరీ’ అని బెర్నాడెట్ గ్రహించింది.

మొత్తం 18 సార్లు ఆమెకు ఈ దర్శనాలు కలిగాయి. ఆ స్త్రీ బెర్నాడెట్‌తో “ప్రపంచ మార్పు కోసం ప్రార్థించు, తపస్సు చేయు” అని చెప్పింది. ఫిబ్రవరి 25న, ఆ స్త్రీ ఆదేశం మేరకు బెర్నాడెట్ నేలపై తవ్వగా అక్కడ ఒక నీటి ఊట ఉద్భవించింది. ఆ నీటిని తాగిన వారు, ఆ నీటితో స్నానం చేసిన వారు అద్భుత రీతిలో రోగాల నుండి నయం కావడం మొదలైంది.

సన్యాసినిగా జీవితం మరియు మరణం

1866లో ఆమె ‘సిస్టర్స్ ఆఫ్ ఛారిటీ’ సభలో చేరి ‘సిస్టర్ మేరీ-బెర్నార్డ్’ గా పేరు మార్చుకుంది. అనారోగ్యంతో ఉన్నా ఆమె తోటి సన్యాసినులకు సేవ చేసేది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, తన వల్ల పుట్టిన లూర్దు నీటితో వేలమంది నయమవుతున్నా, ఆమె మాత్రం తన అనారోగ్యాన్ని భగవంతుడిచ్చిన శిక్షగా భావించి ఆ నీటిని తన కోసం వాడుకోవడానికి నిరాకరించింది. 1879 ఏప్రిల్ 16న తన 35వ ఏట ఆమె మరణించింది.

శాస్త్రానికే సవాలు: చెక్కుచెదరని శరీరం

బెర్నాడెట్ మరణించిన 30 ఏళ్ల తర్వాత, 1909లో ఆమె నామకరణ ప్రక్రియలో భాగంగా సమాధిని తెరిచారు. అప్పుడు వైద్యులు చూసి ఆశ్చర్యపోయారు. సాధారణంగా మృతదేహం కొన్ని రోజుల్లోనే అస్థిపంజరంగా మారుతుంది, కానీ బెర్నాడెట్ శరీరం అప్పుడే నిద్రపోయినట్లుగా, ఎటువంటి రసాయనాలు (Embalming) వాడకపోయినా కుళ్లిపోకుండా ఉంది.

వైద్య నివేదికలో “శరీరంలో ఎక్కడా కుళ్లిపోయిన గుర్తులు లేవు” అని రాశారు. ఆ తర్వాత 1919లో, మళ్లీ 1925లో సమాధిని తెరిచినా ఆమె శరీరం అలాగే ఉంది. 1933లో పోప్ పియస్ XI ఆమెను ‘సెయింట్’ (పరిశుద్ధురాలు) గా ప్రకటించారు.

2025లోనూ అదే అద్భుతం

నేటికీ, 145 ఏళ్లు దాటినా, ఫ్రాన్స్‌లోని నెవర్స్ (Nevers) లోని ఒక గాజు పేటికలో ఆమె శరీరం భద్రంగా ఉంది.

సైన్స్ ఏమంటుంది?

  • మట్టిలోని ఖనిజాలు కారణం కావచ్చని కొందరు అంటారు.
  • సమాధిలోని ఉష్ణోగ్రత శరీరాన్ని కాపాడి ఉండవచ్చని మరికొందరు భావిస్తారు.
  • కానీ 140 ఏళ్లకు పైగా ఎటువంటి రసాయనాలు లేకుండా ఒక శరీరం ఇలా ఉండటాన్ని సైన్స్ పూర్తిస్థాయిలో వివరించలేకపోతోంది.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.