సినీ నటి ప్రగతి తన ఫిట్‌నెస్, అందం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో మనందరికీ తెలిసిందే. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె తన ఒత్తైన జుట్టు రహస్యాన్ని పంచుకుంటూ .. ఒక ప్రత్యేకమైన హోమ్ మేడ్ హెయిర్ ప్యాక్ గురించి వివరించారు.
బియ్యం కడిగిన నీరు, కోడిగుడ్డు, కొబ్బరి నూనెలతో తయారుచేసే ప్యాక్ తాను తరచుగా వాడతానని తెలిపారు. అంతే కాకుండా ఈ సందర్భంగానే ప్యాక్ వల్ల కలిగే ప్రయోజనాలను కూడా వెల్లడించారు. ఇంతకీ ప్రగతి వాడే హెయిర్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి. దాని వల్ల కలిగే ప్రయోజనాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
హెయిర్ ప్యాక్ తయారీ ,ఉపయోగాలు:
ఈ ప్యాక్ తయారు చేయడానికి ప్రగతి గారు సూచించిన పదార్థాలు మన వంటింట్లో సులభంగా దొరికేవే..
బియ్యం కడిగిన నీరు :ఇందులో ఉండే ఇనోసిటాల్ అనే కార్బోహైడ్రేట్ దెబ్బతిన్న జుట్టును రిపేర్ చేస్తుంది. అమైనో ఆమ్లాలు, విటమిన్ B, E లు జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి.
ఎగ్ :ఎగ్‌లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. జుట్టు ప్రధానంగా కెరాటిన్ అనే ప్రోటీన్‌తో నిర్మితమవుతుంది కాబట్టి.. ఎగ్ ప్యాక్ వేయడం వల్ల జుట్టుకు తగినంత పోషణ అంది కొత్త జుట్టు మొలవడానికి సహకరిస్తుంది.
కొబ్బరి నూనె: ఇది సహజసిద్ధమైన కండీషనర్‌గా పనిచేస్తుంది. జుట్టు లోపలి పొరల వరకు వెళ్లి తేమను కూడా అందిస్తుంది.
ఈ ప్యాక్ వల్ల కలిగే ప్రయోజనాలు:
కొత్త జుట్టు: ఈ ప్యాక్ వాడటం వల్ల కొత్త జుట్టు వస్తుంది.
జుట్టు పెరుగుదల: బియ్యం నీరు, గుడ్డులోని ప్రోటీన్లు జుట్టు కుదుళ్లను ఉత్తేజితం చేసి, కొత్త జుట్టు పెరగడానికి దోహదపడతాయి.
మెరుపు, మృదుత్వం: ఈ మిశ్రమం జుట్టుకు సహజమైన మెరుపును ఇస్తుంది. అంతే కాకుండా జుట్టు చిక్కుబడకుండా మృదువుగా మారుతుంది.
బలమైన కుదుళ్లు: జుట్టు రాలడం తగ్గి, వెంట్రుకలు మందంగా తయారవుతాయి.
అతిగా వాడితే కలిగే నష్టం – డ్రై హెయిర్ సమస్య:
నటి ప్రగతి ఈ ప్యాక్ గురించి చెబుతూ ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా చేశారు. ఈ ప్యాక్‌ను తరచుగా వాడటం వల్ల జుట్టు డ్రై అయ్యే అవకాశం ఉందని ఆమె తెలిపారు.
ఎందుకు అలా జరుగుతుంది ?
బియ్యం నీటిలో , ఎగ్లో ప్రోటీన్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిని “ప్రోటీన్ ఓవర్‌లోడ్” అంటారు. జుట్టుకు ప్రోటీన్ అవసరమే.. కానీ అది మితిమీరితే వెంట్రుకలు బిరుసుగా మారి, తేమను కోల్పోతాయి. దీనివల్ల జుట్టు మెరుపు తగ్గడమే కాకుండా.. త్వరగా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది.
ప్రగతి సూచించిన చిట్కా:
జుట్టు డ్రై అవ్వకుండా ఉండటానికి ప్రగతి గారు ఒక సింపుల్ ట్రిక్ ఫాలో అవుతారు. ఆమె ఈ ప్యాక్ వేసుకునే ముందు లేదా క్రమం తప్పకుండా జుట్టుకు నూనె బాగా అప్లై చేస్తారు. నూనె రాయడం వల్ల జుట్టు మీద ఒక రక్షణ పొర ఏర్పడుతుంది. ఇది ప్రోటీన్ ఓవర్‌లోడ్ కాకుండా బ్యాలెన్స్ చేస్తుంది. స్నానానికి ముందు తలకు నూనెతో మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ పెరిగి ప్యాక్ లోని పోషకాలు బాగా అందుతాయి.
సహజ సిద్ధమైన పద్ధతులు ఎప్పుడూ మంచివే.. కానీ వాటిని వాడే విధానం తెలియాలి. ప్రగతి చెప్పినట్టు బియ్యం నీరు, ఎగ్ ప్యాక్ వారానికి ఒకసారి లేదా పది రోజులకు ఒకసారి వేసుకోవడం ఉత్తమం. జుట్టు తత్వాన్ని బట్టి (ఆయిలీ లేదా డ్రై) నూనె వాడకాన్ని సర్దుబాటు చేసుకోవాలి.

































