భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో చారిత్రక ప్రయోగం చేసి విజయం సాధించింది. డిసెంబర్ 24న ఎల్వీఎం 3 రాకెట్ ద్వారా బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహాన్ని ప్రయోగించింది.
ఇది సెల్యులార్ కవరేజ్ లేని ప్రాంతాలకు సేవలు అందించడానికి ఉద్దేశించిన భారీ మిషన్. 4జీ, 5జీ సిగ్నల్‌ను నేరుగా సాధారణ స్మార్ట్‌ఫోన్‌లకు అందించడం దీని ఉద్దేశం. బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహాన్ని మోసుకుంటూ 24వ తేదీ ఉదయం 8:55 నిమిషాలకు LVM3 శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి అంతరిక్షానికి దూసుకెళ్లింది. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం ఉదయం 8:54 నిమిషాలకు టేకాఫ్ తీసుకోవాల్సి ఉండగా.. అంతరిక్షంలో ఇతర ఉపగ్రహాల నుంచి వెలువడిన వ్యర్థాలు బాహుబలి రాకెట్ పయనించే మార్గంలో అడ్డంకిగా మారే అవకాశం ఉన్నందున టేకాఫ్ టైమ్‌ను మరో 90 సెకన్ల పాటు డిలే చేయడం జరిగింది.
ఎల్వీఎం 3 సిరీస్ లో ఇది తొమ్మిదవ మిషన్. ఇస్రోకు 101వ ప్రయోగం. 2025లో ఇస్రో చేపట్టిన అయిదోది కూడా. అమెరికాకు చెందిన ఏఎస్‌టీ స్పేస్‌మొబైల్ అభివృద్ధి చేసిన బ్లూబర్డ్ బ్లాక్ 2, ఉపగ్రహ టెలికమ్యూనికేషన్స్‌లో ఓ వ్యూహాత్మక ప్రయోగంగా భావిస్తోన్నారు. కక్ష్యలోకి వెళ్ళిన తర్వాత ఇది తన 223 చదరపు మీటర్ల ఫేజ్డ్-అరే యాంటెన్నాను విస్తరిస్తుంది. లో- ఆర్బిట్ లో అతిపెద్ద కమర్షియల్ కమ్యూనికేషన్ యాంటెన్నాగా రికార్డు సృష్టించింది.
ఎక్కువ బ్యాండ్‌విడ్త్
బ్లూబర్డ్ బ్లాక్ శాటిలైట్ బరువు 6,100 కిలోలు. ఇంతకుముందు ప్రయోగించిన అయిదు మోడళ్ల కంటే కూడా 10 రెట్లు ఎక్కువ బ్యాండ్‌విడ్త్‌ను అందిస్తుంది. 5,600 పైగా సిగ్నల్ సెల్స్ ను అందిస్తుంది. సాధారణ మొబైల్ స్మార్ట్ ఫోన్ లకు కూడా నేరుగా కనెక్టివిటీని అందిస్తుంది. దీనికోసం వినియోగదారులకు ఎలాంటి అదనపు ఇన్‌స్టాలేషన్ లేదా అప్‌గ్రేడ్‌లు అవసరం లేదు. ఈ ఉపగ్రహం సెకనుకు 120 మెగాబిట్స్ గరిష్ట వేగాన్ని అందిస్తుంది.
నెట్‌వర్క్ లేని ప్రాంతాల్లో…
ఇది 4జీ, 5జీ నెట్‌వర్క్‌ల ద్వారా వాయిస్, మెసేజింగ్, వేగవంతమైన డేటా బదిలీలు, నిరంతరాయ వీడియో స్ట్రీమింగ్‌కు సరిపోతుంది. బ్లూబర్డ్ బ్లాక్ 2 ప్రధాన ఉద్దేశం.. అమెరికాను పూర్తిగా కవర్ చేయడం. అనంతరం దశలవారీగా ప్రపంచవ్యాప్తంగా కనెక్టివిటీని అందిస్తుంది. గ్రామీణ ప్రాంతాలు, సముద్ర జలాలు, విమాన ప్రయాణాల్లో సాంప్రదాయ సెల్యులార్ నెట్‌వర్క్‌లు అందించలేని కవరేజ్ అంతరాలను ఇది పూరిస్తుంది.
బాహుబలి రాకెట్ వినియోగం
ఈ మిషన్ కోసం ఇస్రో తన LVM3 రాకెట్‌ను ఉపయోగిస్తోంది. ఈ బాహుబలి రాకెట్ ఎత్తు 43.5 మీటర్లు. 640 టన్నుల బరువు. బ్లూబర్డ్ బ్లాక్ 2ను భూమికి దాదాపు 520 కిలోమీటర్ల ఎత్తులో లో- ఆర్బిట్ లో ప్రవేశపెట్టనుంది. ఇప్పటివరకు ఇస్రో ప్రయోగించిన అత్యంత బరువైన ఈ పేలోడ్ లల్లో ఇదీ ఒకటి. అలాగే, లియో కక్ష్యలో ఇప్పటివరకు అతిపెద్ద కమర్షియల్ కమ్యూనికేషన్ ఉపగ్రహంగా నిలవనుంది. బ్లూబర్డ్ బ్లాక్ 2 విజయవంతం కావడంతో కమ్యూనికేషన్ల ముఖచిత్రం ఇకపై మారుతుంది.


































