టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో తొలి మ్యాచ్‌లోనే ఈ 14 ఏళ్ల కుర్రాడు సెంచరీతో చెలరేగాడు.
ఈ టోర్నీలో బిహార్ తరఫున బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ.. అరుణాచల్ ప్రదేశ్‌తో రాంచీ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో 36 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు.
తద్వారా విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీ బాదిన అతి పిన్న వయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. అంతేకాకుండా లిస్ట్-ఏ క్రికెట్‌లోనే సెంచరీ బాదిన అతి పిన్న వయస్కుడిగా రికార్డ్ అందుకున్నాడు. లిస్ట్-ఏలో ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన మూడో బ్యాటర్‌గా నిలిచిన సూర్యవంశీ.. రెండో భారత బ్యాటర్‌గా రికార్డ్ అందుకున్నాడు.
ఈ జాబితాలో జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ 29 బంతుల్లో సెంచరీ బాది అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఏబీ డివిలియర్స్(31), అన్‌మోల్ ప్రీత్ సింగ్(35).. వైభవ్ సూర్యవంశీ(36), కోరే అండర్సన్(36), గ్రహమ్ రోజ్(36) తర్వాతి స్థానంలో ఉన్నారు. అన్‌మోల్ ప్రీత్ సింగ్ 35 బంతుల్లో సెంచరీ బాది లిస్ట్-ఏ క్రికెట్‌లో వేగవంతమైన సెంచరీ బాదిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. గతేడాది అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అన్‌మోల్ ప్రీత్ సింగ్ ఈ ఫీట్ సాధించడం గమనార్హం.
అండర్ 19 ఆసియా కప్ 2025 ఫైనల్లో విఫలమైన వైభవ్ సూర్యవంశీ.. ఆ ఓటమిని అక్కడే మర్చిపోయి ఫ్రెష్‌గా బరిలోకి దిగి చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బిహార్‌కు ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, మంగళ్ మహ్రార్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. మహ్రార్(33) ఔటైనా.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగుతున్నాడు. భారీ సిక్సర్లతో విరుచుకుపడుతున్న వైభవ్.. డబుల్ సెంచరీ దిశగా సాగుతున్నాడు.


































