చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి

దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి మరో చరిత్ర సృష్టించాడు. లిస్ట్‌-ఏ క్రికెట్‌లో అత్యంత వేగంగా 16000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. విరాట్‌ 10, 11, 12, 13, 14, 15 వేల పరుగులను కూడా అత్యంత వేగంగా పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డుల్లో ఉన్నాడు.


విరాట్‌ 16000 పరుగుల అత్యంత అరుదైన మైలురాయిని కేవలం 343 మ్యాచ్‌ల్లో తాకాడు.

విరాట్‌కు ముందు భారత్‌ తరఫున సచిన్‌ మాత్రమే ఈ మైలురాయిని అధిగమించాడు. సచిన్‌ 551 మ్యాచ్‌ల్లో 21999 పరుగులు చేసి, లిస్ట్‌-ఏ క్రికెట్‌ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో ఇంగ్లండ్‌ ఆటగాళ్లు గ్రహాం గూచ్‌ (22211), గ్రేమ్‌ హిక్‌ (22059) మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాలో విరాట్‌ తొమ్మిదో స్థానంలో నిలిచాడు.

విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్‌ 16000 పరుగుల మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్‌లో తొలి పరుగు పూర్తి చేయగానే విరాట్‌ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో విరాట్‌ సెంచరీ కూడా చేశాడు. ఆంధ్ర నిర్దేశించిన 299 పరుగుల లక్ష్య ఛేదనలో 85 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 107 పరుగులతో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు.

ఈ మ్యాచ్‌లో విరాట్‌ జట్టు ఢిల్లీ గెలవాలంటే ఇంకా 79 పరుగులు చేయాలి. విరాట్‌తో పాటు నితీశ్‌ రాణా (37) క్రీజ్‌లో ఉన్నాడు. 27.4 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్‌ 220/2గా ఉంది. అంతకుముందు ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ప్రియాంశ్‌ ఆర్మ సుడిగాలి ఇన్నింగ్స్‌ ఆడాడు.

ప్రియాంశ్‌ కేవలం 44 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 74 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆంధ్ర తరఫున రికీ భుయ్‌ (122) సెంచరీ చేశాడు. ఆ జట్టు కెప్టెన్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి 23 పరుగులకు ఔటయ్యాడు. ఢిల్లీ బౌలర్లలో సిమర్‌జీత్‌ సింగ్‌ 5 వికెట్లతో సత్తా చాటాడు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.