ఏపీ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. నూతన సంవత్సరం వేళ రైతులకు కొత్త కానుక ప్రకటించింది. ఇందు కోసం ముహూర్తం ఖరారు చేసింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేసింది.
గ్రామాల్లో ప్రత్యేకంగా సభలు నిర్వహించి తాజా నిర్ణయం అమలు దిశగా కార్యాచరణ ఖరారు చేయటంతో పాటుగా అమలు దిశగా మార్గదర్శకాలు విడుదల చేసింది. జిల్లా యంత్రాంగానికి కీలక సూచనలు చేసింది.
ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీకి నిర్ణయించింది. ఎన్నికల సమయంలో రైతులకు పట్టాదార్ పుస్తకా పైన ప్రభుత్వం హామీ ఇచ్చింది. వైసీపీ హయాం లో మాజీ సీఎం జగన్ ఫొటోతో ఉన్న పాసు పుస్తకాలను తెలిగించి.. రైతులకు అవసరమైన విధంగా కొత్త పట్టాదార్ పుస్తకాలను పూర్తి సమాచారంతో ఇస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. కాగా, ఇప్పుడు ఈ కొత్త పాస్ బుక్స్‌పై రాష్ట్ర రాజముద్ర (ఎంబ్లమ్) ఉంటుంది.
అంతేకాకుండా, క్యూఆర్ కోడ్ కూడా ముద్రించి ఉంటుంది. దాన్ని స్కాన్ చెయ్యడం ద్వారా రైతులు తమ భూమి వివరాల ను సులభంగా ఆన్‌లైన్‌లో చెక్ చేసుకునే వెసులుబాటు కలగనుంది. భూమి రికార్డులను రెవిన్యూ శాఖ సరిదిద్దుతోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే కీలక సూచనలు చేసింది. కాగా, తొలి విడతగా 21.86 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్నారు.
ఇవి రీ-సర్వే పూర్తయిన గ్రామాల్లోని రైతులకు అందనున్నాయి. ఈ పాస్ బుక్స్‌లో ఎలాంటి తప్పులూ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్దేశించింది. అదే సమయంలో లైవ్ వెబ్‌ల్యాండ్ డేటాబేస్ నుంచి వివరాలు తీసుకొని ముద్రిస్తున్నారు. గతంలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, 6,688 రీ-సర్వే గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి 2.79 లక్షల దరఖాస్తులు, మిగతా 17,600 గ్రామాల్లో రెవెన్యూ సదస్సుల్లో 1.85 లక్షల ఫిర్యాదులు పరిష్కరించారు.
తాజా నిర్ణయం మేరకు కొత్త సంవత్సరం ప్రారంభంతో జనవరి 2 నుంచి 9 వరకు గ్రామ సభలు నిర్వహించి, ఈ పాస్ పుస్తకాలను రైతులకు అందజేయనున్నారు. రెవెన్యూ శాఖ అధికారులు రీ-సర్వే పూర్తయిన గ్రామాల్లో ఈ పంపిణీని చేపడతారు. ఉచితంగా పాస్ బుక్ ఇచ్చిన తర్వాత కూడా ఏవైనా మార్పులు అవసరమైతే ఉచితంగా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కొత్త పాస్ పుస్తకాలు హై-సెక్యూరిటీ ఫీచర్లతో రూపొందించారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే చాలు.. భూమి వివరాలు తెలుస్తాయి. ఇక బ్యాంక్ లోన్ల కోసం పాస్ బుక్ ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.


































