కొత్త పాస్ బుక్స్ ఎలా ఉంటాయి?:
కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలను హై-సెక్యూరిటీ ఫీచర్లతో రూపొందించారు. పాత పాస్ బుక్స్‌లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫొటో ఉండగా, కొత్తవి రాష్ట్ర రాజముద్ర (అధికారిక గుర్తు)తో ముద్రించి ఉంటాయి. ఈ పుస్తకాలపై క్యూఆర్ కోడ్ ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. ఈ పాస్ బుక్స్ లైవ్ వెబ్‌ల్యాండ్ డేటాబేస్ నుంచి వివరాలు తీసుకొని ముద్రించినవి కాబట్టి, ఎలాంటి తప్పులూ లేకుండా కచ్చితమైన సమాచారం ఉంటుంది.
పాత పాస్ బుక్స్ (భూ హక్కు పత్రాలు)లో జగన్ ఫొటో ఉండటం వివాదాస్పదమైంది. అంతేకాకుండా, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో హడావిడిగా చేసిన రీ-సర్వేలో పేర్లు, హద్దులు, ఫోన్ నంబర్లు, ఆధార్ వివరాల్లో అనేక తప్పులు జరిగాయి. లక్షల ఫిర్యాదులు వచ్చాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ ఫిర్యాదులన్నీ పరిశీలించి సరిచేసి, ఎర్రర్-ఫ్రీ పాస్ బుక్స్ ఇస్తోంది. హై-సెక్యూరిటీ ఫీచర్ల కారణంగా వీటిని ట్యాంపరింగ్, కాపీ చేయడం అసాధ్యం. ఇక బ్యాంక్ లోన్ల కోసం పాస్ బుక్ సమర్పించాల్సిన అవసరం లేదు. ఇకపై రుణాలు.. వెబ్‌ల్యాండ్ లోన్ చార్జ్ మాడ్యూల్ ద్వారా నేరుగా మంజూరవుతాయి. రుణాల పంపిణీ సమయంలో e-KYC, ఫింగర్ ప్రింట్‌తో ధ్రువీకరణ జరుగుతుంది.
కొత్త పాస్ బుక్‌పై ముద్రించిన క్యూఆర్ కోడ్‌ను మొబైల్‌తో స్కాన్ చేసి, ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే.. భూమి యజమాని వివరాలు, భూమి స్థానం, మ్యాప్, హద్దులు, ఎకరాలు అన్నీ ఆన్‌లైన్‌లో కనిపిస్తాయి. ఇది భూమి మోసాలను అరికట్టడమే కాదు, రైతులు ఎప్పుడైనా తమ రికార్డులు సులభంగా చెక్ చేసుకోవచ్చు. ప్రపంచ స్థాయి సెక్యూరిటీతో ఇలా డిజైన్ చేశారు.
వీటిని రైతులకే ఇస్తారా.. అందరికీ ఇస్తారా?:
పట్టాదారు పాస్ బుక్స్‌ని భూమి హక్కుదారులకు (పట్టాదారులకు) ఇస్తారు. ప్రధానంగా రైతులే లబ్ధిదారులు, కానీ రీ-సర్వే పూర్తయిన గ్రామాల్లో భూమి యజమాన్యం ఉన్న అందరికీ అంటే.. రైతులే కాకుండా ఇతర భూయజమానులకు కూడా ఇస్తారు. మొదటి దశలో రీ-సర్వే జరిగిన 6,688 గ్రామాలు, ఇతర ప్రాంతాల్లోని పట్టాదారులకు పంపిణీ జరుగుతుంది. పాత పాస్ బుక్స్ తిరిగి సేకరిస్తారు. ఉచిత పంపిణీ తర్వాత కూడా ఏవైనా సవరణలు అవసరమైతే ఉచితంగానే చేస్తారని మంత్రి హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతోంది. భూమి రికార్డులు డిజిటలైజ్ చేసి, రైతుల హక్కులు బలోపేతం చేయడమే లక్ష్యం. ఈ పంపిణీతో రైతులు సంక్రాంతి పండుగకు ముందే కొత్త ఏడాది కానుకను పొందుతారు.


































