తెలుగు రాష్ట్రాల్లో చలితో పాటు పొగమంచు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. రాత్రి పూట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు చేరుకుంటున్నాయి.
కొన్నిరోజులుగా ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న చలిగాలులతో వాతావరణం చల్లగా మారిపోతోంది. రాబోయే రెండు మూడు రోజులు చలితీవ్రత మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూలేని విధంగా నెల రోజుల నుంచి విపరీతమైన చలి మొదలైంది. దీంతో ఉదయం వేళ బయటకు రావాలంటేనే భయపడి పోతున్నారు ప్రజలు. తెల్లవారుజాము నుంచి 8 – 9 గంటల వరకు రోడ్లు, జనావాసాల్లో పొగమంచు కమ్మేస్తోంది. దీంతో ఎదురుగా ఏమీ కనిపించకపోవడంతో వాహనదారులు తెగ ఇబ్బందులు పడుతున్నారు. ఎదురెదురుగా వస్తున్న వాహనాలు ఢీకొని స్వల్ప ప్రమాదాలకూ దారితీస్తున్నాయి. పొగమంచు కారణంగా ద్విచక్ర వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
ఇరు తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. తెలంగాణలోని నల్గొండ, చిట్యాల, చౌటుప్పల్ మధ్య దట్టమైన పొగమంచు అలుముకుంటుంది. దీంతో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిలో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ములుగు ఏజెన్సీ ప్రాంతాలను పొగమంచు దుప్పటిలా కప్పేసింది. గోదావరి తీర ప్రాంతంలో చలి విపరీతంగా పెరిగిపోయింది. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లోనూ పరిస్థితి దారుణంగా మారింది.
ఇక ఏపీ విషయానికి వస్తే.. మన్యం ప్రాంతాలను చలి వణికిస్తోంది. ఉదయం పూట పొగమంచు దట్టంగా కురవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని రోజుల పాటు చలి, పొగమంచు తిప్పలు తప్పేలా లేవు. కాబట్టి ప్రజలు, వాహనదారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది.































