ఖమ్మం జిల్లా వేంసూరు మండల పరిధిలోని మొద్దులుగూడెం గ్రామంలో నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాల శ్రీ వివేకానంద విద్యాలయం కు చెందిన స్కూల్ బస్సు శుక్రవారం సాయంత్రం ప్రమాదవశాత్తు బోల్తా పడింది.
గణేష్‌పాడు-సోబ్బాయిగూడెం గ్రామాల మధ్య ఉన్న పంట కాలవలోకి బస్సు ఒరిగిపోయింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో సుమారు 60 మంది విద్యార్థులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో సుమారు 20 మంది విద్యార్థులకు గాయాలు అయినట్లు సమాచారం. గాయపడిన వారిని 108 అంబులెన్స్ సిబ్బంది వేంసూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు తెలిపారు. బస్సు డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడపడం వల్లే ప్రమాదం చోటుచేసుకున్నట్లు బస్సులో ఉన్న విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

































