గుంటూరు విజయవాడ నగరాలకు భారీ శుభవార్త చెప్పిన రాజధాని అమరావతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాజధాని అమరావతిపై ఫోకస్ చేస్తుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మూడు రాజధానుల నిర్ణయంతో ఏపీ రాజధాని ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశారు.


రాజధాని అమరావతిని అభివృద్ధి చేయలేదు. దీంతో రాజధాని అమరావతిపై నీలినీడలు కమ్ముకున్నాయి. అక్కడ అంతకు ముందు జోరుగా జరిగిన నిర్మాణాలు నిలిచిపోయాయి. రియల్ ఎస్టేట్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది.

విజయవాడ-గుంటూరులలో మళ్ళీ రియల్ బూమ్

ఎంతోమంది కాంట్రాక్టర్లు, రియల్టర్లు తీవ్ర నష్టాలలో మునిగిపోయారు. ఇక తాజాగా కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుండి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు ఊపందుకోవడంతో మళ్ళీ విజయవాడ, గుంటూరు ప్రాంతాలలో రియల్ వ్యాపారం కొత్త ఊపిరి పోసుకుంటుంది. విజయవాడ-గుంటూరు జాతీయ రహదారి ఇప్పుడు రియల్ ఎస్టేట్ కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది. 2014 తర్వాత గతంలో టీడీపీ పాలించిన సమయంలో కనిపించిన ఉత్సాహం మళ్లీ ప్రస్తుతం స్పష్టంగా కనిపిస్తోంది.

వారం రోజుల్లో 20కిపైగా కొత్త అపార్ట్‌మెంట్ ప్రాజెక్టులకు భూమిపూజ

గత వారం రోజుల్లోనే ఈ కారిడార్‌లో దాదాపు 20కిపైగా కొత్త అపార్ట్‌మెంట్ ప్రాజెక్టులకు భూమిపూజ జరగడం మళ్ళీ ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అన్న భావనకు ఊపిరి పోస్తుంది.రాజధాని నిర్మాణ పనుల పునరుద్ధరణ, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేకదృష్టి సారించడంతో మళ్ళీ రాజధాని అమరావతి ప్రాంతంపై ప్రజల దృష్టి మళ్ళుతుంది. సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకునే మధ్యతరగతి ప్రజలు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఈ ప్రాంతంవైపు మొగ్గు చూపుతున్నారు.

పెరిగిన నిర్మాణాల జోరు

ముఖ్యంగా కాజ, మంగళగిరి, పెదకాకాని పరిసరాల్లో ఆధునిక నిర్మాణాల జోరు అధికమైంది. ఇక్కడ కేవలం సాధారణ అపార్ట్‌మెంట్లే కాకుండా, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్లకు కూడా డిమాండ్ విపరీతంగా పెరిగింది. హైవేకు ఇరువైపులా సర్వీస్ రోడ్ల విస్తరణతో పాటు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల వేగం పెరిగింది.

ఇన్వెస్టర్స్ పోటీ అందుకే

ఏడాది కాలంగా స్తబ్దుగా ఉన్న మార్కెట్ ఒక్కసారిగా పుంజుకుని, కొనుగోలుదారుల సందడితో కళకళలాడుతోంది. నివాస ప్రాంతాలకే కాకుండా కమర్షియల్ స్పేస్‌కు కూడా ఇక్కడ భారీగా గిరాకీ ఏర్పడింది. మల్టీప్లెక్స్‌లు, కార్పొరేట్ హాస్పిటల్స్, ప్రధాన బ్రాండెడ్ షోరూమ్‌లు ఈ హైవే వెంట పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. భూముల ధరలు అధికంగా ఉన్నప్పటికీ, భవిష్యత్తులో ఈ ప్రాంతం ఒక భారీ మెట్రో సిటీగా అవతరిస్తుందన్న భావనతో ఇన్వెస్టర్లు పోటీ పడి పెట్టుబడులు పెడుతున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.