రూల్స్ మారాయి.. వాహనదారులకు హెచ్చరిక, తప్పించుకోవడం ఇక కష్టం

మీ కారు (Car) లేదా బైక్ (Bike) పాతదైపోయిందా? ఫిట్‌నెస్ రెన్యువల్‌(Vehicle fitness renewal) కోసం ఆఫీసు మెట్లెక్కకుండానే, ఏజెంట్లకు డబ్బులిచ్చి సర్టిఫికెట్ (Vehicle fitness certificate) తెచ్చుకుంటున్నారా?
అయితే మీకో షాకింగ్ న్యూస్. ఆ ‘మేనేజ్’ చేసే రోజులు పోయాయి. దొడ్డిదారిన పొందే సర్టిఫికెట్లకు చెక్ పెడుతూ కేంద్ర ప్రభుత్వం వాహన ఫిట్‌నెస్ విషయంలో సరికొత్త, స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొస్తోంది. ఆ కొత్త రూల్స్ ఏంటి? మీ వాహనంపై అవి ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? వంటి వివరాలు తెలుసుకుందాం.


దొడ్డిదారిన సర్టిఫికెట్లకు చెక్
ఈ ‘ఫేక్’ దందాకు అడ్డుకట్ట వేయడానికే కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) కొత్త డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను సిద్ధం చేసింది. దీని ప్రకారం.. ప్రైవేట్ వాహనాలు కూడా కమర్షియల్ వెహికల్స్ తరహాలోనే అధికారిక ‘ఆటోమేటెడ్ టెస్ట్ స్టేషన్లలో’ (ATS) టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే బండిని ఫిజికల్‌గా అక్కడికి తీసుకెళ్తేనే టెస్ట్ చేస్తారు, లేదంటే కుదరదు.

ఆటోమేటెడ్ టెస్టింగ్
కొత్త రూల్స్ ప్రకారం, వాహనం వయసు 15 ఏళ్లు దాటితే, రిజిస్ట్రేషన్ రెన్యువల్‌ కోసం కచ్చితంగా ఆటోమేటెడ్ టెస్ట్ స్టేషన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఇండియాలో ఇప్పటికే 160కి పైగా ఇలాంటి స్టేషన్లు ఉన్నాయి. అక్కడ కంప్యూటరైజ్డ్ మిషన్ల ద్వారా ఫిట్‌నెస్, ఎమిషన్ చెక్స్ చేస్తారు. 15 ఏళ్లు దాటిన వాహనాలకు ప్రతి ఐదేళ్లకోసారి ఈ టెస్ట్ తప్పనిసరి. దీనివల్ల ఏజెంట్ల ద్వారా ఫేక్ సర్టిఫికెట్లు తెచ్చుకునే ఛాన్స్ పూర్తిగా మూసుకుపోతుంది.

కీలకమైన ’10 సెకన్ల వీడియో’ రూల్
ఈ మొత్తం ప్రాసెస్‌లో అత్యంత కీలకమైన మార్పు ఇదే. ఇన్‌స్పెక్షన్ నిజంగానే జరిగిందా లేదా అని క్రాస్ చెక్ చేయడానికి ప్రభుత్వం కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టింది. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ జారీ చేసే ముందు, టెస్టింగ్ స్టేషన్ లేదా అధికారి వాహనానికి సంబంధించిన కనీసం 10 సెకన్ల వీడియోను అప్‌లోడ్ చేయాలి. ఇది సాధారణ వీడియో కాదు, ‘జియో-ట్యాగ్’ (లొకేషన్‌తో కూడిన) వీడియో అయి ఉండాలి.

ఈ వీడియోలో వాహనం ముందు, వెనుక, ఎడమ, కుడి వైపు భాగాలు (360 డిగ్రీలు) కవర్ అవ్వాలి. అంతేకాదు.. నంబర్ ప్లేట్, ఛాసిస్ నంబర్, ఇంజన్ నంబర్ స్పష్టంగా కనిపించాలి. ఇలా చేయడం వల్ల ఇన్‌స్పెక్షన్ చేయకుండానే సర్టిఫికెట్లు ఇచ్చే పాత పద్ధతులకు శాశ్వతంగా పుల్ స్టాప్ పడుతుంది.

టెస్ట్ ఫెయిల్ అయితే.. టైమ్ 180 రోజులే
ఒకవేళ మీ వాహనం ఫిట్‌నెస్ టెస్టులో ఫెయిల్ అయితే పరిస్థితి ఏంటి? దీనికి కూడా ప్రభుత్వం స్ట్రిక్ట్ డెడ్‌లైన్ పెట్టింది. వాహనం ఫెయిల్ అయిన రోజు నుంచి, రిపేర్ చేయించుకుని మళ్లీ టెస్ట్ పాస్ అవ్వడానికి గరిష్టంగా 180 రోజులు (6 నెలలు) మాత్రమే గడువు ఇస్తారు. ఈ గడువులోగా సర్టిఫికెట్ పొందలేకపోతే, ఆ వాహనాన్ని అధికారికంగా ‘ఎండ్-ఆఫ్-లైఫ్ వెహికల్’ (ELV)గా ప్రకటిస్తారు. వెంటనే నేషనల్ ‘వాహన్’ డేటాబేస్‌లో ఈ బండిని ELVగా మార్చేస్తారు. అంటే ఆ బండి ఇక రోడ్డెక్కడానికి పనికిరాదు, స్క్రాప్‌కి వేయాల్సిందే.

నో ఎక్స్‌టెన్షన్స్ – నో లూప్‌హోల్స్
గతంలో ఫీజులు కట్టి 180 రోజుల గడువును పదే పదే పొడిగించుకునే వెసులుబాటు ఉండేది. కానీ కొత్త రూల్స్ ప్రకారం ఆ ఆప్షన్ తీసేస్తున్నారు. బండిని కండిషన్‌లో ఉంచుకోవడం లేదా స్క్రాప్ చేయడం.. ఈ రెండే ఆప్షన్లు ఉంటాయి. టెస్టింగ్ స్టేషన్లు కూడా తప్పుడు రిపోర్టులు ఇవ్వకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.

ఎందుకీ మార్పులు?
దేశంలో రోడ్డు భద్రతను పెంచడం, కాలుష్యాన్ని తగ్గించడమే ఈ కొత్త విధానం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. డిజిటల్ సాక్ష్యాలతో కూడిన ఈ పారదర్శక విధానం వల్ల.. కండిషన్ లేని డొక్కు వాహనాలు రోడ్ల మీద నుంచి తొలగిపోతాయి. ఇండియాలో వెహికల్ సర్టిఫికేషన్ ప్రాసెస్‌ను పూర్తిగా ప్రక్షాళన చేసే దిశగా ఇది ఒక పెద్ద ముందడుగు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.