తిరుమలలో ఎన్నాకెన్నాళ్లకు.. 15 ఏళ్ల తర్వాత ఇలా, ఉచితంగానే.. సామాన్య భక్తులకు మంచి అవకాశం

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతునన్నాయి. ఈ నెల 2 నుంచి టోకెన్లు లేని భక్తుల్ని దర్శనాలకు అనుమతిస్తున్నారు. ఈ క్రమంలో కొండపై ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది.


ఈ క్రమంలో సామాన్య భక్తులకు అద్భుతమైన అవకాశం దక్కింది. అడ్వాన్స్ టికెట్లు, సిఫారసు లేని సామాన్య భక్తులకు కూడా అభిషేక దర్శనం కల్పించారు. శుక్రవారం అభిషేక సేవ సమయంలో.. దాదాపు 3,000 మందికి పైగా సర్వదర్శనం భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం దక్కింది. 15 ఏళ్ల క్రితం నిలిచిపోయిన ఈ విధానాన్ని తిరిగి అమలు చేశారు.

సాధారణంగా అభిషేక సేవకు అడ్వాన్స్ టికెట్లు, సిఫారసు లేఖలు ఉన్న భక్తులను మాత్రమే అనుమతిస్తారు. అయితే శుక్రవారం తిరుమలలో భక్తుల సంఖ్య గణనీయంగా పెరగడంతో, ఈ నిబంధనలో సడలింపు ఇచ్చారు. అభిషేక సేవ జరుగుతున్న సమయంలోనే.. అంటే ఉదయం 4.30 నుంచి 6 గంటల మధ్య, సర్వదర్శనం చేసుకునే భక్తులను కూడా స్వామివారిని దర్శించుకోవడానికి అనుమతించారు. ఈ అరుదైన అవకాశం దాదాపు పదిహేనేళ్ల తర్వాత సామాన్య భక్తులకు లభించింది. గతంలో ఈ విధానం అమలులో ఉండేదని, అయితే కొన్ని కారణాల వల్ల నిలిపివేశారని అధికారులు తెలిపారు. శుక్రవారం నాటి అనుభవం భక్తులకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని.. భవిష్యత్తులో కూడా ఇలాంటి సడలింపులు ఉండే ఉంటుందా అనే చర్చ జరుగుతోంది.

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు టోకెన్లు లేని భక్తులను అనుమతిస్తున్నారు. గురువారం సాయంత్రం నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. టీటీడీ గురువారం రాత్రి 11.30 నుంచే భక్తుల్ని దర్శనాలకు అనుమతించింది. తిరుమల శ్రీవారికి ఏకాంతసేవ జరిగే వరకు దాదాపు 4వేల మందికి సర్వదర్శనం చేయించారు. శుక్రవారం తెల్లవారుజామున తిరుప్పావై, కైంకర్యాలు ముగిసిన తర్వాత, ఉదయం 2 గంటల నుంచి సర్వదర్శనాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం బాటగంగమ్మ ఆలయం సర్కిల్ దగ్గర నుంచి భక్తులను క్యూలైన్‌లో అనుమతిస్తున్నారు. ఈ క్యూలైన్ రింగురోడ్డులో దాదాపు రెండున్నర కిలోమీటర్ల దూరం వరకు విస్తరించింది. భక్తులు నారాయణగిరి షెడ్లు, వైకుంఠం క్యూకాంప్లెక్స్-2 కంపార్టుమెంట్ల ద్వారా శ్రీవారిని దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు హామీ ఇచ్చారు. భక్తుల సౌకర్యార్థం అన్ని వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు.

తిరుమల శ్రీవారిఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులను జనవరి 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు పూర్తిస్థాయిలో సర్వదర్శనంలో అనుమతిస్తున్నట్లు టీటీడీ అదనపు సీహెచ్ వెంకయ్య చౌదరి చెప్పారు. తిరుమలలోని క్యూలైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లను శుక్రవారం ఉదయం అదనపు ఈవో అధికారులతో కలిసి తనిఖీ చేశారు. వైకుంఠ ద్వార దర్శనానికి విచ్చేసే భక్తులకు నాలుగో రోజైన శుక్రవారం నుండి 8వ తేదీ వరకు పూర్తిగా సర్వదర్శనానికి కేటాయించినట్లు తెలిపారు. జనవరి 1వ తేదీ సాయంత్రం నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తున్నారని, జనవరి 1వ తేదీ రాత్రి నుండి సర్వదర్శనం భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించినట్లు చెప్పారు. శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు, ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసిందని తెలియజేశారు.

టీటీడీలోని అన్ని విభాగాలు పూర్తిస్థాయిలో భక్తులకు సేవలందిస్తున్నారన్నారు. క్యూ లైన్ లలో వేచి ఉండే భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు శ్రీవారి సేవకుల ద్వారా నిరంతరాయంగా అందిస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎప్పటికప్పుడు దర్శన సమయం, భక్తులు క్యూ క్యూలైన్లలోనికి నిర్దేశించిన ప్రవేశ మార్గాలను, పబ్లిక్ అడ్రస్ సిస్టం ద్వారా తెలియజేయస్తున్నట్లు చెప్పారు. అప్పటివరకు భక్తులు, యాత్రికల వసతి సముదాయాలలో విశ్రాంతి తీసుకోవాల్సిందిగా ఆయన సూచించారు. అధిక రద్దీ దృష్ట్యా భక్తులు అధికారుల సూచనలను గమనిస్తూ స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనాన్ని సంయమనం పాటిస్తూ చేసుకోవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. అదనపు ఈవో వెంట వివిధ విభాగాల అధికారులు ఉన్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.