ప్రైవేటు ట్రావెల్‌ బస్సు దగ్ధం

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీప..


కొవ్వూరు గామన్‌బ్రిడ్జిపై బుధవారం తెల్లవారుజామున ప్రైవేటు ట్రావెల్‌ బస్సు దగ్ధమైంది. షార్ట్‌సర్క్యూట్‌తో అందరూ చూస్తుండగానే క్షణాల్లో బస్సంతా మంటలు వ్యాపించి పూర్తిగా కాలిపోయింది. వివరాలివీ.. ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ ట్రావెల్స్‌ బస్సు బుధవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో కొవ్వూరు గామన్‌బ్రిడ్జిపై టోల్‌ప్లాజా వద్దకు వస్తోంది. ఇంతలో డ్రైవర్‌కు అనుమానం వచ్చి రోడ్డు పక్కనే వాహనాన్ని ఆపాడు. అప్పటికే షార్ట్‌సర్క్యూట్‌ జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సులో ఆరుగురు ప్రయాణికులు, నలుగురు సిబ్బంది కలిసి మొత్తం పది మంది ఉన్నారు. ప్రమాదాన్ని ముందుగానే గుర్తించిన డ్రైవర్‌ మరపల్లి భిక్షం.. నిద్రలో ఉన్న సిబ్బందిని అప్రమత్తం చేసి బస్సులోఉన్న అందరినీ దింపివేశాడు. ఫైర్‌ సిలిండర్‌, నీటితో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఫలితం లేకపోవడంతో స్థానిక ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. కొవ్వూరు నుంచి అగ్నిమాపక శకటం వచ్చి మంటలను అదుపుచేసినా అప్పటికే బస్సు కాలిపోయింది. బస్సును వంతెనపై నుంచి హైడ్రాలిక్‌ క్రేన్‌సాయంతో కిందకు తరలించే క్రమంలో క్రేన్‌ బోల్తా పడింది. దీంతో దాన్ని మరో క్రేన్‌తో పైకి తీశారు.

ప్రయాణికులు బెంబేలు!

పండగ నేపథ్యంలో ఉద్యోగ ఉపాధి నిమిత్తం ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారంతా తమ సొంత ఊళ్లకు వస్తుంటారు. ప్రయాణికుల రవాణాకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఇటీవల ట్రావెల్‌ బస్సుల్లో వరుస అగ్ని ప్రమాదాలు జరగడంతో ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. సంక్రాంతి నేపథ్యంలో ప్రైవేటు ట్రావెల్‌ బస్సుల ఫిట్‌నె్‌సను పూర్తిస్థాయిలో చెక్‌ చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణించే బస్సులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.