దేశవ్యాప్తంగా జనగణనకు సిద్ధమవుతోంది ప్రభుత్వం.. తొలిసారిగా డిజిటల్ విధానంలో జనగణన జరగబోతోంది.. తొలి విడతలో భాగంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో..
ఏప్రిల్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ వరకు ఇళ్ల వివరాలను సేకరించబోతున్నారు.. తొలిదశలో హౌస్ లిస్టింగ్, గణన ఈ ఏడాది ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య జరగనుండగా.. రెండో దశలో జనాభా లెక్కల సేకరణ వచ్చే ఏడాది అంటే.. 2027 ఫిబ్రవరి- మార్చి వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.. ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనగణన కసరత్తు అధికారికంగా ప్రారంభమైంది. ఈ మేరకు జనగణన అధికారుల నియామకానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జనగణనను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా, సబ్‌డివిజనల్, సబ్‌డిస్ట్రిక్ట్ స్థాయిల్లో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
అలాగే పట్టణాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా కూడా జనగణన కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా జనగణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించడమే లక్ష్యంగా ఈ ఏర్పాట్లు చేపట్టినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. జనగణన అధికారుల విధులను అడ్డుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. జనగణన విధుల్లో అంతరాయం కలిగిస్తే జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించేలా ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొంది. ప్రజలు జనగణనకు పూర్తి సహకారం అందించాలని, సరైన సమాచారం అందించడం ద్వారా రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. జనగణన ద్వారా లభించే డేటా భవిష్యత్తు విధానాల రూపకల్పనకు కీలకంగా ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థాయిల్లో సమన్వయంతో జనగణన కసరత్తు చేపట్టాలని, ఎలాంటి లోపాలు లేకుండా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.


































