భువనమ్మ మరో అరుదైన ఘనత.. సీఎం చంద్రబాబు ప్రశంసలు

పీ సీఎం నారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆమె హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే.


ఈ క్రమంలోనే నారా భువనేశ్వరికి ఇండియన్ డెయిరీ అసోసియేషన్ (సౌత్ జోన్) ప్రతిష్టాత్మక ‘అవుట్‌స్టాండింగ్ డెయిరీ ప్రొఫెషనల్’ అవార్డును ప్రదానం చేసింది. డెయిరీ రంగంలో ఎన్నో ఏళ్లుగా చేస్తున్న విశేష సేవలు, రైతు కేంద్రిత విధానాలకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది. దీంతో ఈ విషయం ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

అవార్డు అందుకున్న అనంతరం నారా భువనేశ్వరి ఇండియన్ డెయిరీ అసోసియేషన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని వేలాది మంది పాడి రైతులకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. రైతుల సహకారం లేకుండా ఈ స్థాయి సాధ్యం కాదని పేర్కొన్నారు. డెయిరీ రంగ అభివృద్ధి, నాణ్యమైన పాల ఉత్పత్తులు, రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా భవిష్యత్తులో కూడా నిరంతరం కృషి చేస్తానని ఆమె స్పష్టం చేశారు.

కాగా డెయిరీ పరిశ్రమలో నాణ్యత, పారదర్శకత, సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహిస్తూ హెరిటేజ్ ఫుడ్స్‌ను దేశవ్యాప్తంగా విశ్వసనీయ బ్రాండ్‌గా నిలిపేందుకు భువనేశ్వరి కీలక పాత్ర పోషించారు. పాడి రైతులకు న్యాయమైన ధరలు, సమయానికి చెల్లింపులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించడం ద్వారా వారి ఆదాయం పెరిగేలా చర్యలు చేపట్టారు. మహిళా సాధికారతను డెయిరీ రంగంతో అనుసంధానిస్తూ ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలను స్వయం ఉపాధి దిశగా నడిపిస్తూ, పాల ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్‌లో వారికి శిక్షణ ఇచ్చి ఆర్థికంగా బలోపేతం చేశారు. ఈ ప్రయత్నాలు మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయని డెయిరీ నిపుణులు ప్రశంసిస్తున్నారు.

సీఎం చంద్రబాబు అభినందనలు..

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సతీమణి భువనేశ్వరిని హృదయపూర్వకంగా అభినందించారు. పాడి రైతుల అభ్యున్నతి, మహిళల సామాజిక-ఆర్థిక పురోగతికి ఆమె చేస్తున్న కృషి స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఈ అవార్డు భువనేశ్వరి వ్యక్తిగత కృషికే కాదు, ఆమెతో కలిసి పనిచేస్తున్న మొత్తం బృందానికి దక్కిన సరైన గుర్తింపని వ్యాఖ్యానించారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని వేలాది మంది పాడి రైతుల కష్టపడి చేసిన శ్రమను కూడా ఈ పురస్కారం ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.