సంక్రాంతి ప్రయాణీకులకు బిగ్ అలర్ట్, అటు వెళ్లారో..జేబులు ఖాళీ

సంక్రాంతి వేళ ప్రయాణాలు భారంగా మారుతున్నాయి. ఆర్టీసీ ప్రచారం ఘనం.. ఆచరణ శూన్యం అన్నట్లుగా వ్యవహరిస్తోంది. నామ మాత్రపు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిందని ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ప్రత్యేక రైళ్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఇక.. ప్రయివేటు వాహనాలతో పండుగకు ఊర్లు వెళ్తున్నారు. నాలుగు రోజుల్లో రెండు లక్షల వాహనాలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించాయి. కాగా, ఇదే అదునుగా భావించి ప్రయివేటు ట్రావెల్స్ రెగ్యులర్ ఛార్జీల కంటే నాలుగు రెట్లు అదనంగా వసూలు చేస్తున్నాయి.

సంక్రాంతి వేళ ప్రయాణీకుల జేబులు ఖాళీ అవుతున్నాయి. పండుగకు వెళ్లేటప్పుడు.. తిరుగు ప్రయాణం కోసం ముందస్తు బుకింగ్స్ లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వాలు హెచ్చరించి నా.. అధికారులు తనిఖీలు చేసినా ప్రయివేటు ట్రావెల్స్ లో మాత్రం మార్పు రావటం లేదు. ఈ మూడు రోజులకు కలిపి విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్లే ఆర్టీసీ బస్సులు సాధారణ సర్వీసు లతో కలిపి 120 మాత్రమే ఉన్నాయి. దీంతో వేలాదిగా వచ్చిన ప్రయాణికులు ప్రైవేటు ట్రావెల్స్‌ వైపు చూస్తున్నారు. దీంతో, ఇదే అదనుగా ఇష్టానుసారం వసూలు చేస్తున్నారు. నాన్‌ ఏసీ బస్సులు ఒకటీ అర పెట్టి అన్ని ఏసీ స్లీపర్లే చూపిస్తున్నారు. ఆర్టీసీలో ఒక్కో టికెట్‌ రూ.436 ఉంది. ప్రైవేటు ట్రావెల్స్‌లో నాన్‌ ఏసీ సీటు రూ.1,200-1800 ఉంది. ఏసీ స్లీపర్లు, సెమీ స్లీపర్లకు రూ.1500- 2,000పైగా వసూలు చేస్తున్నారు.

దీంతో, చాలా మంది సొంత వాహనాలతో సొంత ఊర్లకు చేరుకుంటున్నారు. పేరుకు అధికారులు తనిఖీలు చేస్తున్నా.. ప్రయివేటు తీరులో మాత్రం మార్పు కనిపించటం లేదు. ప్రయివేటు దందా తో ప్రయాణీకులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కో టికెట్‌ రూ.3వేలకు పైగా అమ్ముతున్నారు. దీంతో వీరి దోపిడీ ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. ఆర్టీసీ, రైల్వేలో టికెట్లు లేక.. ప్రయివేటు ఛార్జీలు చెల్లించలేక సొంత వాహనాలతో చాలామంది బయల్దేరుతున్నారు. రోజుకు దాదాపు 50వేల వాహనాలు ప్రయాణిస్తుంటే అందులో 10 నుంచి 15శాతం ద్విచక్ర వాహనాలే. కాగా, ఈ స్థాయిలో రద్దీ కనిపిస్తున్నా హైదరాబాద్‌ నుంచి విజయవాడకు పీఎన్‌బీఎస్‌ కేవలం 24 ప్రత్యేక బస్సులు మాత్రమే కేటాయించింది. సంక్రాంతికి వేలాదిగా తరలివచ్చే ప్రయాణికులకు ఇవి ఏమాత్రం చాలకపోవటంతో.. ప్రయివేటు ట్రావెల్స్ ను ఆశ్రయిస్తున్నారు. వారు చెప్పిన రేట్లు చెల్లించ లేక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.