విదేశాల్లో మీ పాస్‌పోర్ట్ పోగొట్టుకుంటే ఏం చేయాలి ముందు :
మీ పాస్‌పోర్ట్ పోయిందని తెలిసిన వెంటనే మీరు చేయాల్సిన మొదటి పని స్థానికంగా ఉండే పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. పాస్‌పోర్ట్ పోగొట్టుకున్నందుకు పోలీసులు దీన్ని సీరియస్‌గా తీసుకుంటారు. ఎందుకంటే అది లేకుండా కొత్త పాస్‌పోర్టు జారీ చేయడం జరగదు. లేదా అత్యవసర ప్రయాణ పత్రాన్ని జారీ చేయలేరు. అందుకే నివేదికలో పోగొట్టుకున్న పాస్‌పోర్ట్‌కు సంబంధించిన పూర్తి సమాచారం ఉండాలి.
పోలీసు నివేదిక అందిన వెంటనే మీరు చేయాల్సిన మరో పని తిన్నగా వెళ్లి భారత రాయబార కార్యాలయాన్ని లేదా భారత హై కమిషన్‌ను సంప్రదించాలి. విదేశాల్లో ఉన్న భారతీయ పౌరుల సహాయం కోసం అక్కడ రాయబార కార్యాలయం ఉంటుంది. అక్కడికి వెళ్లిన వెంటనే కార్యాలయ సిబ్బంది మీ గుర్తింపును ధ్రువీకరిస్తారు. అలాగే తదుపరి చర్యలపై సమాచారాన్ని అందిస్తారు.
అత్యవసర సర్టిఫికెట్ :
మీరు విదేశాల్లో మీ పాస్‌పోర్టును పోగొట్టుకుని వెంటనే భారత్‌కు తిరిగి రావాల్సిన అవసరం ఉంటే, అక్కడే వేచి చూడడం ఇష్టం లేకపోతే భారత రాయబార కార్యాలయం అత్యవసర సర్టిఫికెట్ అనే పిలువబడే ఒక వన్ టైమ్ ట్రావెల్ డాక్యుమెంట్‌ను మీకు జారీ చేస్తుంది. అది మిమ్మల్ని నేరుగా ఇండియాకు తిరిగి రావడానికి అనుమతిని ఇస్తుంది.
నూతన లేదా తాత్కాలిక పాస్‌పోర్ట్ :
మీ ట్రిప్ కొనసాగుతున్నట్లయితే లేదా మీరు ఉన్న దేశంలోనే ఉండాలని ప్లాన్ చేసుకుంటే మాత్రం రాయబార కార్యాలయం కొత్త లేదా తాత్కాలిక పాస్‌పోర్ట్‌ను జారీ చేయవచ్చు. దీనికి అత్యవసర సర్టిఫికెట్ కంటే కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. ఎందుకంటే దీనికి అదనపు ధ్రువీకరణ చేయాల్సి ఉంటుంది.
కొత్త పాస్‌పోర్టు కోసం :
విదేశాల్లో పాస్‌పోర్ట్ పోగొట్టుకుంటే, మీరు కొత్త పాస్‌పోర్ట్ కోసం ముందుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. భారత ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ లేదా embassy.passportindia.gov.in ని సందర్శించడం ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. కొత్త పాస్‌పోర్ట్ దరఖాస్తు ఫారమ్‌ను ఫిల్ చేయడానికి, స్థానిక పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ కాపీ, పాస్‌పోర్ట్ సైజు ఫొటో, మీ పాత పాస్‌పోర్ట్ మొదటి మరియు చివరి పేజీ కాపీ, అందుబాటులో ఉంటే విమాన టికెట్ లేదా ప్రయాణ సమాచారం మరియు గుర్తింపు పత్రాలు మీ దగ్గర ఉంచుకొని జత చేయాల్సి ఉంటుంది.




































