మేడారంలో ముందే మొదలైన సందడి

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన పండుగగా ప్రసిద్ధి చెందిన సమ్మక్క- సారలమ్మ మహాజాతరకు ముహూర్తం దగ్గర పడుతుండటంతో మేడారం పరిసరాలు భక్తజన సంద్రంగా మారాయి.


జాతర ప్రారంభానికి మరో పది రోజుల సమయం ఉన్నప్పటికీ ముందే మొక్కులు చెల్లించుకోవాలనే ఉద్దేశంతో లక్షలాదిమంది భక్తులు మేడారానికి తరలివస్తున్నారు. శుక్రవారం వేకువజాము నుండే సుదూర ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలి రావడంతో మేడారం కిక్కిరిసిపోయింది. వన దేవతలను దర్శించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. ముందుగా పవిత్ర జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి, అనంతరం తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గద్దెల ప్రాంగణం మొత్తం భక్తులతో నిండిపోవడంతో ఇప్పుడే ‘మహా జాతర’ మొదలైందా అన్నట్లుగా పరిస్థితులు నెలకొన్నాయి. భక్తులు ఆరాధ్య దైవాలకు బంగారం (బెల్లం), చీర, సారె సమర్పించి ఆశీస్సులు తీసుకుంటున్నారు. భక్తుల వాహనాలు భారీగా రావడంతో పోలీసులు ట్రాఫిక్ నియంత్రణకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. రహదారులపై వాహనాలు నిలిచిపోకుండా ఉండేందుకు ట్రాఫిక్ను మళ్లించి, సమీపం లోని పొలాల్లో ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికార యంత్రాంగం. అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది.

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సీతక్క

ములుగు: ఈ నెల 18న ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి మేడారం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్‌ దివాకర టి.ఎస్. ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ లతో కలిసి శుక్రవారం పరిశీలించారు. హెలిపాడ్ స్థలాన్ని, టెంట్ సిటీ, సాంస్కృతిక కార్యక్రమాల సభా ప్రాంగణాన్ని, క్యూ లైన్ షెడ్స్, మీడియా టవర్ నిర్మాణాలను, ప్రధాన ఆర్చి ఫ్లోరింగ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క అధికారులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అన్ని ఏర్పాట్లు శనివారం సాయంత్రం లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. సభా ప్రాంగణ పరిసరాలలో వ్యర్ధాలను వెంటనే తొలగించాలని, రహదారుల వెంట భక్తులకు తాగునీరు అందించాలని కూడా ఆదేశించారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.