టీచర్లకూ టార్గెట్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. విద్యార్థుల ఫలితాల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వనుంది. టెన్త్, ఇంటర్ పరీక్షల్లో విద్యార్థుల మార్కులను కొలమానంగా తీసుకోనుంది. ప్రభుత్వం నియమించిన విద్యాకమిటీ కూడా ఈ మేరకు సిఫార్సులు చేసేందుకు సిద్ధమైంది. పాఠశాల, కళాశాల స్థాయిలో విద్యా ప్రమాణాల మెరుగుకు ఈ చర్యలు అనివార్యమని కమిటీలోని సభ్యులు అభిప్రాయపడుతున్నారు. టీచర్లు, లెక్చరర్లలో మరింత జవాబుదారీ తనం పెంచాల్సిందేనని సీఎం సూచించినట్టు తెలిసింది.
ఇటీవల భేటీ అయిన విద్యా కమిటీ ఈ అంశంపై లోతుగా చర్చించింది. ఇతర రాష్ట్రాల్లో ఈ తరహా విధానాలు అమలు చేస్తున్నారని కమిటీ సభ్యులు అంటున్నారు. దీనిపై కొంత అధ్యయనం చేయాలని నిర్ణయించారు. పూర్తి వివరాలతో ప్రాథమిక నివేదికను ఫిబ్రవరి మొదటి వారంలో ప్రభుత్వానికి సమర్విస్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. మౌలిక వసతులు లేని ప్రభుత్వ స్కూళ్లల్లో వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోకుండా టార్గెట్లు పెడితే సహించేది లేదని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఎన్ఈపీ ప్రామాణికం
టీచర్స్ ఫెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండికేటర్స్ ఉండాలని జాతీయ విద్యా విధానం-2020 (ఎన్ఈపీ) సూచిస్తోంది. ఇప్పటి వరకూ ఎన్ఈపీని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయలేదు. పాఠశాల విద్యలో అనేక ఇబ్బందులున్నాయని చెబుతోంది. అయితే రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు దిగజారుతున్నాయనే విమర్శ ఎక్కువగా వస్తోంది. నేషనల్ అచీవ్మెంట్ సర్వేలోనూ ఇది వెల్లడైంది. టెన్త్ విద్యార్థులు సైతం ఇంగ్లిష్, మేథ్స్‌లో 70 శాతం వెనుకబడి ఉన్నారని తెలిపింది. ప్రాథమిక విద్యలో రెండంకెల లెక్కలు కూడా చేసే పరిస్థితి లేదని చెబుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేసిన అధ్యయనంలో ఇంటర్ విద్యలో విద్యార్థులు బట్టీ చదువులతో నెట్టుకొస్తున్నారు. 80 శాతం ప్రభుత్వ కాలేజీల్లో ఫలితాలు పడిపోతున్నాయి. ప్రాక్టికల్స్‌పై కనీస అవగాహన కూడా ఉండటం లేదని తేల్చారు. వీటిని సరిచేయడానికి ఎన్ఈపీలోని కొన్ని విధానాలు అనివార్యమని ప్రభుత్వం నియమించిన తెలంగాణ విద్యాపాలసీ కమిటీ అభిప్రాయపడుతోంది. అయితే ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపిన తర్వాత, పరిస్థితిని వివరించి ఈ విధానం తీసుకొస్తే మేలని కమిటీలోని పలువురు చెబుతున్నారు.
ఫలితం లేకుంటే పాయింట్స్ డౌన్
పాఠశాల, కాలేజీ స్థాయిలో విద్యార్థుల సంఖ్య, వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత, అందులోనూ ర్యాంకులను కొలమానంగా తీసుకోవాలన్నది కమిటీ సిఫార్సుగా తెలుస్తోంది. దీనిని సబ్జెక్టుల వారీగా కూడా విడగొడతారు. కాలేజీ, స్కూల్లో ఫలితాలు 90 శాతం ఉంటే కొన్ని పాయింట్లు ఇస్తారు. కాలేజీ ప్రిన్సిపాల్, స్కూల్ హెచ్ఎంకు ఇది వర్తిస్తుంది. సబ్జెక్టుల వారీగా ఫలితాలను ప్రామాణికంగా తీసుకొని ప్రతీ టీచర్స్‌కు పాయింట్లు ఇస్తారు. బదిలీలు, పదోన్నతుల్లో వీటినే కొలమానంగా తీసుకుంటారు. ఎక్కువ పాయింట్లు వచ్చిన టీచర్‌కు ప్రాధాన్యం ఇస్తారు. ఐదేళ్లుగా సంబంధిత సబ్జెక్టులో 40 శాతం కన్నా తక్కువ ఫలితాలు వస్తున్న టీచర్‌కు తొలి దశలో కౌన్సెలింగ్ చేపట్టాలని సూచిస్తున్నారు. ఆ తర్వాత రెండేళ్లల్లో కూడా ఫలితాల పురోగతి పెరగకపోతే ఏ తరహా చర్యలు తీసుకోవాలనే అంశంపై కమిటీ సభ్యులు చర్చిస్తున్నారు. ఇంక్రిమెంట్లో కోత పెట్టడమా? భవిష్యత్‌లో ఇంక్రిమెంట్ ఇవ్వకుండా ఆపేయడమా? అనే అంశాలపై ఇంకా స్పష్టత రాలేదు.
ఇది మాల్ ప్రాక్టీస్‌కు దారి తీస్తుంది
ఈ విధానం పాఠశాల, కళాశాలల్లో మాల్ ప్రాక్టీస్‌కు దారి తీస్తుంది. టార్గెట్లు పెడితే విద్యార్థులతో కాపీ కొట్టించే ప్రమాదం ఉంది. దీనివల్ల విద్యా ప్రమాణాలు మరింత తగ్గొచ్చు. అసలు టీచర్లకు స్వేచ్ఛగా పాఠం చెప్పే అవకాశం ఇవ్వడం లేదు. ఫిజిక్స్‌వాలా, ఖాన్ అకాడమీ వారి సాఫ్ట్‌వేర్‌ను ఫాలో అవ్వాల్సి వస్తోంది. టీచర్స్‌కు స్వేచ్ఛ ఇస్తే విద్యార్థి మానసిక పరిస్థితికి తగ్గట్టు పాఠం చెబుతాడు. టార్గెట్లు పెడితే తీవ్రంగా వ్యతిరేకిస్తాం. – చావా రవి, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
టీచర్ల ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది
ప్రభుత్వ స్కూళ్లకు వచ్చే విద్యార్థులంతా పేద, బడుగు, బలహీన వర్గాల వారే. సామాజిక, ఆర్థిక పరిస్థితుల కారణంగా వారు రెగ్యులర్ రావడం లేదు. దీంతో వారికి పాఠం ఎలా అర్థమవుతుంది? వాస్తవ పరిస్థితిని తెలుసుకోకుండా టార్గెట్లు పెడితే ఉపాధ్యాయుల ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. ఈ విధానం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. – పుల్గం దామోదర్ రెడ్డి, పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు
దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం
ప్రైవేట్ స్కూళ్లల్లో విద్యార్థులకు పరీక్ష పెట్టి మరీ తీసుకుంటారు. ప్రభుత్వ స్కూళ్లకు ఆ వెసులుబాటు ఉండదు. చురుకైన విద్యారి్థ, కాస్త వెనుకబడిన విద్యార్థి ఎవరైనా తీసుకోవాల్సిందే. వారికి పాఠాలు చెప్పాల్సిందే. ఇక్కడ డిటెన్షన్ విధానం కూడా లేదు. అలాంటప్పుడు ప్రభుత్వ స్కూళ్లల్లో గ్రేడింగ్ పెట్టడం ఎలా సాధ్యం? టీచర్లను వేధించే ఇలాంటి చర్యలకు ఏమాత్రం మద్దతు ఇవ్వం. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే ఆందోళన చేపడతాం.



































