కోర్టుల స్పష్టమైన ఆదేశాలను సైతం లెక్కచేయకుండా రాజకీయ నేతలు సంక్రాంతి పండుగను భారీ జూదోత్సవంగా మార్చారని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కోడి పందేలు, క్యాసినోలు, పేకాట, గుండాట, నంబర్ల ఆటలు విచ్చలవిడిగా సాగాయి.ఈ మూడు రోజుల వ్యవధిలోనే వేల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వందల సంఖ్యలో బరులు ఏర్పాటు కాగా, ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికంగా కోడి పందేలు జరిగాయి. భీమవరం, ఉండి, దెందులూరు, రావులపాలెం ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బరులు గోవా, శ్రీలంక క్యాసినోలను తలపించేలా అత్యంత ఆర్భాటంగా నిర్వహించారు. గన్నవరం-నూజివీడు మధ్య మీర్జాపురం, బిళ్లనపల్లి సమీపంలోని బరులు రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తల రాకతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీవీఐపీ గ్లాస్ గ్యాలరీలు, క్యారవాన్లు, బౌన్సర్లు, ఏసీ గ్యాలరీలు, ఎల్ఈడీ స్క్రీన్లు, రాత్రివేళ ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేసి పందేల బరులను ఎగ్జిబిషన్లలా మార్చేశారు.
కొన్ని బరుల్లో ప్రవేశానికి రూ.2 వేల నుంచి రూ.లక్ష వరకు ఎంట్రీ ఫీజులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అతిథులకు ప్రత్యేక వంటకాలు, బిర్యానీలు, మద్యం సరఫరా చేయడంతో పాటు, కొన్నిచోట్ల గోవా నుంచి క్లబ్ డ్యాన్సర్లను కూడా రప్పించినట్లు సమాచారం. పెద అమిరం బరి వద్ద క్యాసినో ఏర్పాటు చేసి ప్రత్యేక అతిథులకు వినోద కార్యక్రమాలు నిర్వహించారన్న ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి.
పందేల పరిమాణం చూస్తే చిన్న బరుల్లో వేల నుంచి లక్షల వరకు, పెద్ద బరుల్లో లక్షల నుంచి కోట్ల వరకు పందేలు జరిగినట్లు అంచనా. భీమవరం, ఉండి ప్రాంతాల్లోని 14 పెద్ద బరుల్లో వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు చెబుతున్నారు. తాడేపల్లిగూడెం బెల్ట్‌లోనే రూ.250 కోట్ల మేర పందేలు జరిగినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల్లో రూ.4,500 నుంచి రూ.5 వేల కోట్ల వరకు జూదం సాగిందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కొన్ని పందేల్లో కార్లు, బైక్‌లు బహుమతులుగా ఇచ్చారు. రాజమహేంద్రవరం చెందిన ఓ వ్యక్తి రెండు రోజుల్లోనే రూ.2.5 కోట్ల వరకు గెలిచిన ఘటన చర్చనీయాంశమైంది. మరోవైపు పందేల వల్ల వివాదాలు, ఘర్షణలు చోటుచేసుకుని గాయాల వరకు వెళ్లిన ఘటనలు నమోదయ్యాయి. అయినప్పటికీ అనేక చోట్ల పోలీసులు కేసులు నమోదు చేయకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.
ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాల్లో ఈసారి సంక్రాంతి సందర్భంగా కోడి పందేలు, జూద క్రీడలు హద్దులు దాటి సాగాయి. ఈ మూడు జిల్లాల పరిధిలోనే దాదాపు రూ.1,450 కోట్ల మేర పందేలు జరిగి భారీగా నగదు చేతులు మారినట్లు సమాచారం. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పరిధిలో ఏర్పాటు చేసిన బరిలో రాష్ట్రంలోనే అతి పెద్ద పందెం నమోదైంది. అక్కడ జరిగిన ఒకే ఒక్క పందెం విలువ రూ.1.53 కోట్లకు చేరింది.
గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా రాజమహేంద్రవరం చెందిన రమేశ్ డేగ జాతి కోడి, గుడివాడకు చెందిన ప్రభాకర్ సేతువ జాతి కోడి మధ్య భారీ పందెం పడింది. గత సంవత్సరం ప్రభాకర్ కోడి రూ.కోటి గెలవగా, ఈసారి రమేశ్‌కు చెందిన కోడి విజయం సాధించి రూ.1.53 కోట్లు గెలుచుకోవడం విశేషం. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన అతిపెద్ద కోడి పందెంగా ఇది రికార్డు సృష్టించినట్లు తెలుస్తోంది. రమేశ్ బృందం, హైదరాబాద్‌కు చెందిన కొవ్వూరి జానకిరామరాజు గ్రూప్ కలిసి భోగి రోజున రూ.63 లక్షలు, సంక్రాంతి రోజున రూ.1.53 కోట్లు, కనుమ రోజున రూ.45 లక్షలు గెలుచుకున్నట్లు సమాచారం.
కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి ప్రాంతంలో కనుమ రోజు మరో భారీ పందెం జరిగింది. హైదరాబాద్‌కు చెందిన ఎక్స్ఈఎన్ఈఎక్స్ నిర్వాహకుడు అమర్ బృందం, ప్రత్యర్థి సిండికేట్ మధ్య జరిగిన ఈ పందెంలో అమర్‌కు చెందిన సేతువ పుంజు విజేతగా నిలిచింది. ఈ పందెం విలువ దాదాపు రూ.కోటి వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈసారి ప్రతి బరి చుట్టూ 10 నుంచి 15 వరకు శిబిరాలు ఏర్పాటు చేసి పేకాట, ఇతర జూద క్రీడలు నిర్వహించడంతో వందల కోట్ల రూపాయలు చేతులు మారాయి. నిఘా వర్గాల సమాచారం ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.250 కోట్లకు పైగా, ఉమ్మడి తూర్పు గోదావరిలో సుమారు రూ.500 కోట్లు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో దాదాపు రూ.700 కోట్ల మేర పందేలు జరిగినట్లు అంచనా వేస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.



































