పురుషులకూ ఉచిత బస్సు ప్రయాణం.. మ్యానిఫెస్టో విడుదల

తమిళనాడులో ఎన్నికల వేడి మొదలైంది. ఎన్నికల సమరానికి రంగం సిద్ధమవుతున్న వేళ, ఏఐఏడీఎంకే కీలక అడుగు వేసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.


పళణిస్వామి తొలిసారి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ప్రజల దైనందిన జీవనానికి నేరుగా ఉపయోగపడేలా ఐదు ప్రధాన హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచారు. మహిళల సంక్షేమాన్ని ప్రధానంగా పరిగణలోకి తీసుకుంటూ, ప్రతి మహిళకు నెలకు రూ.2,000 నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యేలా పథకం అమలు చేస్తామని ఏఐఏడీఎంకే హామీ ఇచ్చింది. ఇప్పటికే రాష్ట్రంలో మహిళా ఓటర్లను ఆకర్షించే పథకాలు ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఈ హామీ రాజకీయంగా కీలకంగా మారనుంది.

రవాణా రంగంలో మరో కీలక ప్రకటన చేసింది ఏఐఏడీఎంకే. నగరాల్లో పురుషులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటివరకు మహిళలకు మాత్రమే ఉన్న ఉచిత ప్రయాణ పథకాన్ని విస్తరించనున్నట్లు స్పష్టం చేసింది. ఇల్లు లేని వారి కోసం ‘అమ్మ ఇంటి పథకం’ను అమలు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో సొంత ఇల్లు లేని వారికి ప్రభుత్వం భూమిని కొనుగోలు చేసి, కాంక్రీట్ ఇళ్లను నిర్మించి ఉచితంగా అందజేస్తామని స్పష్టం చేసింది. అలాగే పట్టణ ప్రాంతాల్లో ఇల్లు లేని వారికి అపార్ట్‌మెంట్ ఇళ్లు నిర్మించి ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఒకే కుటుంబానికి చెందిన షెడ్యూల్డ్ కులాల కుటుంబాలు వివాహానంతరం వేరు వేర్పాటు అయినా.. వారికి సైతం ఈ పథకం వర్తిస్తుందని ఏఐఏడీఎంకే స్పష్టం చేసింది. మహిళల సాధికారతకు మరో అడుగుగా ‘అమ్మ టూ వీలర్ పథకం’ను మళ్లీ అమలు చేస్తామని ప్రకటించింది. ఈ పథకం కింద 5 లక్షల మంది మహిళలకు ద్విచక్ర వాహనం కొనుగోలుకు రూ.25,000 సబ్సిడీ అందజేస్తామని హామీ ఇచ్చింది. ఉద్యోగాలు, స్వయం ఉపాధి కోసం మహిళలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా ఉపాధి హామీ పథకాన్ని కూడా విస్తరించనున్నట్లు ఏఐఏడీఎంకే ప్రకటించింది. ప్రస్తుతం 100 రోజులుగా ఉన్న ఉపాధి హామీని 150 రోజులుగా పెంచుతామని హామీ ఇచ్చింది. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరిగి, వలసలు తగ్గుతాయని పార్టీ అభిప్రాయపడుతోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.