కన్నీళ్లు ఎందుకొస్తాయి? కన్నీటిలో నీరు కాకుండా ఇంకా ఏమేం ఉంటాయి?

కోపం, విచారం, పట్టలేనంత ఆనందం ఇలా ఎలాంటి ఉద్వేగానికైనా మనకు కన్నీళ్లు వస్తాయి.


మీకు తెలుసా?

భావోద్వేగాల కారణంగా కన్నీరు కార్చే జీవులు మనుషులు మాత్రమే.

జంతువులు కూనలుగా ఉన్నప్పుడు తమ అసౌకర్యాన్ని తెలియజేయడానికి గట్టిగా అరుస్తాయి. అయితే సంక్లిష్టమైన భావోద్వేగాలకు కన్నీరు కార్చేలా ప్రతిస్పందించే మస్తిష్క నిర్మాణం వాటిలో ఉన్నట్టుగా కనిపించదు.

కన్నీళ్లు శరీరంలో ఎలా ఉత్పత్తి అవుతాయో శాస్త్రవేత్తలకు తెలుసు. కానీ భావోద్వేగాలకు కన్నీటికి మధ్య సంబంధం మాత్రం ఇంకా పూర్తిగా అర్థం కాలేదు.

కన్నీళ్లు అంటే?

“మ్యూకస్‌, ఎలక్ట్రోలైట్లు, నీరు, ప్రోటీన్లు, లిపిడ్లు అనే ఐదింటితో కన్నీళ్లు తయారవుతాయి” అని స్విట్జర్లాండ్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బయాలజీలో పోస్ట్‌డాక్టరల్ ఫెలో డాక్టర్ మేరీ బానియర్‌ హెలావెట్ వివరించారు.

ఈ ఐదు వేరు వేరు లక్షణాలు కలిగి ఉంటాయని ఆమె బీబీసీ వరల్డ్ సర్వీస్ కార్యక్రమం క్రౌడ్‌సైన్స్‌లో చెప్పారు. ఉదాహరణకు ప్రోటీన్లకు వైరస్‌లు, బ్యాక్టీరియాలను ఎదుర్కొనే గుణం ఉంటుంది. ఎలక్ట్రోలైట్లు శరీరానికి అవసరమైన ఖనిజాలు.

కన్నీళ్లలో కూడా మూడురకాలు ఉన్నాయని చెప్పారు.

”కంటి ఉపరితలంపై బేసల్ కన్నీరనేది ఎప్పుడూ ఉంటుంది. ఇది కంటిని తడిగా ఉంచి రక్షిస్తుంటుంది” అని ఆమె చెప్పారు.

అలాగే కంట్లో దుమ్ము, పురుగు, ఏదైనా చికాకు కలిగించే పదార్థం పడితే ప్రతిస్పందనగా వచ్చే కన్నీటిని రిఫ్లెక్స్ టియర్స్ అంటారు. ఈ విషయాన్ని కంటి కార్నియాలోని నాడీకణాలు గుర్తిస్తాయి.

కార్నియా శరీరంలోనే అత్యధిక నాడీ కణాల సాంద్రత కలిగిన భాగం. ఇవి ఉష్ణోగ్రత, ఒత్తిడి, పొడిబారడం వంటి మార్పులను గుర్తించగలవని హెలావెట్ చెప్పారు.

కన్నీటిని నియంత్రించే మెదడు భాగమైన లాక్రిమల్ న్యూక్లియస్‌కు ఈ నాడీ కణాల నుంచి సంకేతాలు చేరతాయి. దీంతో లాక్రిమల్ న్యూక్లియస్ కన్నీటి గ్రంథులకు ‘ఎక్కువ కన్నీరు ఉత్పత్తి చేయమని’ సంకేతాలు పంపుతుంది.

ఇక మూడోరకమైన భావోద్వేగ కన్నీరే చాలా క్లిష్టమైన సంగతి.

భావోద్వేగాలను నియంత్రించే మెదడు భాగాలు కూడా లాక్రిమల్ న్యూక్లియస్‌తో సంబంధం కలిగి ఉంటాయి. కానీ ఇది సాధారణ ప్రతిస్పందనలా కాకుండా మరింత క్లిష్టమైన మార్గాల్లో జరుగుతుంది.

”ఏడుపు సాధారణంగా ఒక్క భావాన్నేకాదు, భావోద్వేగాల బరువుకు సూచిక” అంటారు నెదర్లాండ్స్‌లోని టిల్బర్గ్ విశ్వవిద్యాలయంలో క్లినికల్ సైకాలజీ ఎమెరిటస్ ప్రొఫెసర్ అడ్వింజర్‌హూట్స్.

“భావాలు చాలా సార్లు కలగలసి వుంటాయి లేదా వేగంగా మారుతూ ఉంటాయి” అని ఆయన చెబుతున్నారు.

వయసు పెరిగేకొద్దీ మనం ఏడ్చే కారణాలు కూడా మారుతాయని ఆయన వివరించారు. పిల్లల్లో శరీరానికి సంబంధించిన నొప్పులు ఏడుపునకు ప్రధాన కారణంగా ఉంటే, పెద్దలు, వృద్ధులలో అది అంతగా ఉండదు.

వయస్సు పెరిగేకొద్దీ, ఏడుపు అనేది సానుభూతితో ముడిపడుతుంది. “మన బాధకే కాదు, ఇతరుల బాధను చూసి కూడా మనం ఏడుస్తాం” అని ఆయన చెప్పారు.

కళల అందం, ప్రకృతి సౌందర్యం వంటి సానుకూల భావోద్వేగాలు కూడా కన్నీటికి కారణం కావచ్చంటారు వింజర్‌హూట్స్.

ఏడుపు మేలు చేస్తుందా?

ఏడిచిన తరువాత హాయిగా ఉందని చాలామంది చెబుతుంటారు. కానీ ఇది నిజమా కాదా అనే విషయంపై శాస్త్రీయ చర్చ ఇంకా కొనసాగుతోంది.

ఏడుపు మనకు మేలు చేస్తుందా లేదో తెలుసుకోవడానికి పరిశోధన చేస్తున్నారు అమెరికాలోని పిట్స్‌బర్గ్ విశ్వవిద్యాలయ క్లినికల్ సైకాలజిస్ట్ లారెన్ బైల్స్‌మా.

మన నాడీవ్యవస్థ ఎలా పనిచేస్తుందో హృదయస్పందనలను నమోదుచేసే ఎలక్ట్రోకార్డియోగ్రామ్‌లు కొంత అవగాహన ఇస్తాయి.

మనం ఏడవడానికి ముందు “భావోద్వేగానికి శరీరం స్పందించే దశ”కు కారణమయ్యే సింపథటిక్ నర్వస్ సిస్టమ్ ఎక్కువగా క్రియాశీలమవుతుందని ఆమె ప్రాథమిక పరిశోధనా ఫలితాలు చెబుతున్నాయి.

“కన్నీళ్లు మొదలైన వెంటనే శరీరాన్ని శాంతింపజేసే పారాసింపథటిక్ నర్వస్ సిస్టమ్ క్రియాశీలత పెరుగుతుంది” అని చెప్పారు. పారసింపథిటిక్ నర్వస్ సిస్టమ్ మనం శాంతంగా, ఊరటగా ఉండటానికి సాయపడుతుంది.

అయితే, ఏడవడం ప్రతిసారీ ఉపశమనాన్ని కలిగిస్తుందని చెప్పలేమని వింజర్‌హూట్స్ అంటున్నారు. ముఖ్యంగా మానసిక కుంగుబాటు, మానసిక శూన్యత ఉన్నవారికి ఇది అంతగా ఉపయోగపడకపోవచ్చు.

మనం ఏ కారణానికి ఏడుస్తున్నామో కూడా కీలకమే. “మన నియంత్రణలో ఉన్న పరిస్థితుల కారణంగా ఏడిస్తే మూడ్ మెరుగవుతుంది. కానీ మన చేతుల్లోలేని పరిస్థితులకు ఏడవడం వల్ల అలా జరగదు” అని ఆయన చెప్పారు.

మన చుట్టుపక్కలవారి స్పందన కూడా ఏడుపుపై ప్రభావం చూపుతుంది.

“వారు అర్థం చేసుకుని ఓదార్చితే మనకు బాగా అనిపిస్తుంది. కానీ ఎగతాళి చేసినా, కోపంగా స్పందించినా, మనకు అవమానంగా అనిపించినా ఉపశమనం కలగదు” అని ఆయన తెలిపారు.

ఏడుపు వల్ల ఇతరులు ఎలా ప్రవర్తిస్తారో చెప్పడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి.

మహిళల భావోద్వేగ కన్నీటి వాసన పీల్చిన పురుషులు, సాధారణ ఉప్పునీటి వాసన పీల్చిన వారితో పోలిస్తే తక్కువ దూకుడుగా ప్రవర్తించారని ఇజ్రాయెల్‌లో ఓ ప్రయోగశాల కేంద్రంగా చేసిన పరిశోధన తెలిపింది.

కన్నీళ్లు మనకు సహాయం అవసరమని తెలియజేసే సామాజిక సంకేతంగా పనిచేస్తాయి. దీంతో ఇతరులు సాయపడటానికి ముందుకు వస్తారని పరిశోధకులు అంగీకరిస్తున్నారు.

భావోద్వేగ కన్నీళ్లు మనల్ని మరింత నమ్మదగినవారిగా చూపిస్తాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది మన పూర్వీకులలో పరస్పర సహకారానికి దోహదపడివుండవచ్చు.

చిన్నపిల్లల ఏడుపు పెద్దల మెదడులోని సంరక్షణ స్పందనను కలిగించే నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తుందనే ఆధారాలు ఉన్నాయి. మనుషులకు బాల్యం దీర్ఘకాలం ఉండటం, ఆ సమయంలో పిల్లలు తల్లిదండ్రులపైన ఆధారపడటమే కన్నీళ్లుపుట్టడానికి కారణమై ఉంటుందని వింజర్‌హుట్స్ చెప్తున్నారు.

పిల్లల కన్నీరు పెద్దల్లో కోపాన్ని తగ్గించే సంకేతంగా పనిచేయవచ్చు. గట్టిగా గుక్కపెట్టి ఏడిస్తే పెద్దలకు చిరాకు కలిగి, వారికి కోపం రావడానికి కారణం కావచ్చు. కానీ ఏడ్చేటప్పుడు వచ్చే కన్నీళ్లు వారి కోపాన్ని తగ్గించి, బిడ్డను రక్షించే సహజసిద్ధ మార్గంగా పనిచేయవచ్చు. ఇది నిర్థరిత నిజం కాకపోయినా ఆసక్తికరమైన ఆలోచనగా పరిశోధకులు భావిస్తున్నారు.

కొందరు ఎక్కువగా ఎందుకు ఏడుస్తారు?

సగటున పురుషులు నెలకు సున్నా నుంచి ఒకసారి మాత్రమే ఏడిస్తే, మహిళలు నెలకు నాలుగు నుంచి ఐదు సార్లు ఏడుస్తారని బైల్స్‌మా చెబుతున్నారు. అయితే వివిధ సంస్కృతులలోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది కాబట్టి ఇదేదో తెచ్చిపెట్టుకున్న ప్రవర్తన కాదని ఆమె అంటున్నారు.

“సాధారణంగా మహిళలు భావోద్వేగాలకు త్వరగా స్పందిస్తారు లేదా ఎక్కువగా వ్యక్తపరుస్తారు. ఏడుపు కూడా ఆ తేడాలో ఒక భాగమే” అంటారు ఆమె. “నాడీ వ్యవస్థ, హార్మోన్లు, వ్యక్తిత్వ లక్షణాల్లో తేడాలు ఉండవచ్చు”అని చెప్పారు.

నెలసరి హార్మోన్లలో మార్పులు ఏడుపును ప్రభావితం చేస్తాయనే బలమైన ఆధారాలు లేవని ఆమె చెబుతున్నారు. అయితే గర్భధారణ సమయంలో, వృద్ధాప్యంలో కనిపించే మార్పుల్ని బట్టి హార్మోన్ల పాత్ర ఉండొచ్చని ఆమె భావిస్తున్నారు.

వ్యక్తిత్వ లక్షణాలపై చేసిన పరిశోధనల్లో భావోద్వేగాలకు ఎక్కువగా లోనయ్యే లక్షాణాలు ఉన్నవారు, బహిరంగంగా భావోద్వేగానికి గురయ్యేవారు ఎక్కువగా ఏడుస్తారని తేలిందని ఆమె తెలిపారు.

”అలాగే ఇతరుల కష్టాలను చూసి సహానుభూతి చెందేవారు కూడా ఎక్కువగా ఏడుస్తారు” అని ఆమె చెప్పారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.