చాలామందికి గుడిలో పెట్టె వివిధ ప్రసాదాలంటే ఎంతో ఇష్టంగా తినడం చూస్తుంటాము. అందులో పులిహోర, దద్దోజనం, పొంగలి, కేసరి వంటి చూస్తూనే ఉంటాము.
అయితే ఇవి మన ఇళ్లలో తయారు చేస్తే ఆయా రుచి రాదు. ఇక రవ్వ కేసరి విషయానికి వస్తే.. ఇంట్లో చేస్తే కొద్దిసేపటికే గట్టిపడిపోవడం, తయారుచేసేటప్పుడు ఉండలు కట్టడం చాలా మందికి ఎదురయ్యే సాధారణ సమస్య. అయితే సరైన కొలతలు, కొన్ని సీక్రెట్ టిప్స్ పాటిస్తే గుడిలో పెట్టే ప్రసాదంలా నోట్లో జారిపోయే విధంగా, రోజంతా మృదువుగా ఉండే రవ్వ కేసరిని చాలా సులువుగా తయారు చేయవచ్చు.
ఈ రెసిపీకి ముఖ్యమైన విషయం కొలత. ఇంట్లో ఉన్న ఏదైనా ఒకే సైజ్ బౌల్‌ను కొలతగా తీసుకుని, అన్ని పదార్థాలను అదే బౌల్‌తో కొలవాలి. ఒక కప్పు ఫైన్ సూజీ రవ్వ తీసుకోవాలి. చిరోటి సూజీ అయితే ఇంకా బెటర్. లేకపోతే నార్మల్ రవ్వతో కూడా ఇదే రిజల్ట్ వస్తుంది.
నీటి పరిమాణం:
ఒక కప్పు రవ్వకు మూడున్నర కప్పుల నీళ్లు అవసరం. నీళ్లు మరిగించే సమయంలో చిటికెడు కుంకుమపువ్వు నలిపి వేస్తే కేసరికి సహజమైన రంగు, మంచి సువాసన వస్తుంది. కావాలంటే ఎల్లో లేదా ఆరెంజ్ ఫుడ్ కలర్ వాడుకోవచ్చు, లేకపోతే ప్లెయిన్‌గా కూడా చేయొచ్చు.
నూనె & నెయ్యి మిశ్రమం:
రవ్వ కేసరి గట్టిపడకుండా ఉండాలంటే నూనె-నెయ్యి మిశ్రమం చాలా కీలకం. రవ్వ తీసుకున్న అదే కప్పుతో మూడో వంతు కప్పు సన్‌ఫ్లవర్ ఆయిల్ తీసుకుని, అలాగే మూడో వంతు కప్పు కరిగించిన నెయ్యి కలపాలి. ఇష్టమైతే దీన్ని ఒక కప్పు వరకు పెంచుకోవచ్చు. నూనెతో పాటు నెయ్యి కలిపి వాడటం వల్ల కేసరి రోజంతా మెత్తగా ఉంటుంది.
రవ్వను ఎలా వేయించాలి?
స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు ముక్కలు, కిస్మిస్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. తర్వాత ఒక కప్పు రవ్వ వేసి మీడియం ఫ్లేమ్‌లో నిరంతరం కలుపుతూ బాగా దోరగా వేయించాలి. రవ్వ తెలుపు రంగు నుంచి లైట్ బ్రౌన్ షేడ్‌కు మారితే పర్ఫెక్ట్‌గా వేయించినట్టే.
నీళ్లు వేసే సరైన స్టేజ్:
రవ్వ వేగిన తర్వాత మరిగించిన కుంకుమ నీటిని ఒక్కసారిగా వేసి, మంట సిమ్‌లో పెట్టి బాగా కలపాలి. రెండు నిమిషాల్లోనే రవ్వ నీళ్లు పీల్చుకుని దగ్గర పడుతుంది. ఈ దశలోనే సరైన టెక్స్చర్ రావడం చాలా ముఖ్యం.
పంచదార & ఫ్లేవర్ అడిషన్స్:
ఇప్పుడు అదే కప్పుతో ఒకటి ముప్పావు కప్పుల పంచదార వేయాలి. పంచదార వేసిన తర్వాత మిశ్రమం కొంచెం పలచన అవుతుంది. ఇది మామూలుగానే జరుగుతుంది. మంచి ఫ్లేవర్ కోసం ఒక టీస్పూన్ యాలకుల పొడి, చిటికెడు పచ్చ కర్పూరం వేయాలి. పచ్చ కర్పూరం వల్ల గుడి ప్రసాదంలా ప్రత్యేకమైన సువాసన వస్తుంది.
పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ:
చివరిగా మిగిలిన నెయ్యిని కూడా వేసి బాగా కలిపి, సిమ్‌లో ఒకటి రెండు నిమిషాలు ఉడికించాలి. కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే నోట్లో వెన్నలా జారిపోయే రవ్వ కేసరి రెడీ.
చల్లారిన తర్వాత కూడా మెత్తగానే:
రవ్వ కేసరి పూర్తిగా చల్లారిన తర్వాత కూడా మృదువుగా, గట్టిపడకుండా ఉండటం ఈ రెసిపీ స్పెషాలిటీ. ఈ పక్కా కొలతలు, టిప్స్ పాటిస్తే ఇంట్లో ప్రసాదానికి అయినా, గుడిలో పంచడానికి అయినా పెద్ద మొత్తంలో రవ్వ కేసరి చేయడం చాలా సులభం అవుతుంది.


































