Tata Group: టాటాలు సూపర్.. రూ.100కే క్యాన్సర్ మందు ఆవిష్కరణ..!!

www.mannamweb.com


Cancer Medicine: దేశం కోసం ఆలోచించే వ్యాపార సంస్థగా ఎల్లప్పుడూ టాటాలు ముందు ఉంటారని మనందరికీ తెలిసిందే. తమ వ్యాపారాల ద్వారా వచ్చిన మెుత్తాన్ని తిరిగి సమాజ హితానికి వినియోగించే గ్రూప్ టాటాలు.
తాజాగా ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ గొప్ప ఆవిష్కరణ గురించి ప్రకటించింది. మానవ క్యాన్సర్ మళ్లీ రాకుండా నిరోధించే సాధారణ చికిత్స, ఔషధాన్ని కనుగొన్నట్లు ప్రకటించింది. మెుదటిసారి క్యాన్సర్ బారినపడి బయటపడ్డ వ్యక్తులకు తిరిగి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందని తెలిసిందే. అయితే దీనిని నిరోధించే మందును టాటా ఇన్‌స్టిట్యూట్ మాత్రల రూపంలో కనిపెట్టింది. దీనిపై పరిశోధకులు దాదాపు 10 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఈ ట్యాబ్లెట్ రోగుల్లో క్యాన్సర్ పునరావృతం కాకుండా నిరోధించడానికి, రేడియేషన్ థెరపీ, డ్రగ్ థెరపీ వంటి చికిత్సల దుష్ప్రభావాలను 50 శాతం వరకు తగ్గిస్తుందని వెల్లడైంది.

టాటా మెమోరియల్ హాస్పిటల్‌లో సీనియర్ క్యాన్సర్ సర్జన్ డాక్టర్ రాజేంద్ర పాడ్వే డ్రగ్ డిస్కవరీ రీసెర్చ్ టీమ్‌లో భాగమయ్యారు. ఎలుకల్లో క్యాన్సర్ కణాలను పంపి తర్వాత చికిత్స చేసినట్లు వెల్లడైంది. అలా క్యాన్సర్ కణాలు చనిపోయినప్పుడు, అవి చిన్న ముక్కలుగా విరిగి క్రోమాటిన్ కణాలను ఏర్పరుస్తాయి. ఈ కణాలు రక్తప్రవాహం ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు ప్రయాణించగలవు. అవి ఆరోగ్యవంతమైన కణాల్లోకి ప్రవేశించినప్పుడు ఆ కణాలను క్యాన్సర్‌గా మార్చే శక్తి ఉంటుందని వివరించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు.. వైద్యులు ఎలుకలకు రెస్వెరాట్రాల్, కాపర్ (R+Cu) కలిగిన యాంటీఆక్సిడెంట్ మాత్రలను అందించారని డాక్టర్ రాజేంద్ర పద్వే తెలిపారు. R+Cu క్రోమాటిన్ కణాలను నాశనం చేసే ఆక్సిజన్ అణువులను ఉత్పత్తి చేస్తుంది.

ఎలుకలపై జరిపిన ప్రయోగ ఫలితాల ప్రకారం క్యాన్సర్ చికిత్స సైడ్‌ఎఫెక్స్ ను తాజాగా కనిపెట్టిన మాత్రలు 50 శాతం తగ్గించటంతో పాటు.. క్యాన్సర్ తిరిగి రాకుండా నిరోధించటంలో 30 శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు టాటా వైద్యులు గుర్తించారు. దశాబ్దకాలం శ్రమించి కనిపెట్టిన మందు ప్యాంక్రియాటిక్, ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్‌లో మంచి పనితీరును కనబరిచింది. అయితే దీనిని అందుబాటులోకి తీసుకొచ్చే ముందు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆమోదం కోసం వేచి ఉంది. ఆమోదం పొందిన తరువాత జూన్-జూలై నుంచి మార్కెట్లోకి మందు అందుబాటులోకి రానుంది. పైగా ఈ మాత్రం కేవలం రూ.100కే అందుబాటులోకి రాబోతోంది. లక్షల మంది రోగులకు పెద్ద ఉపశమనంగా దీనిని చెప్పుకోవచ్చు.