అందులో భాగంగా మెట్రో స్టేషన్లు.. బస్టాప్ లను అనుసంధానం చేస్తూ కొత్త స్కై వేలు అందుబాటులోకి తీసుకొస్తోంది. అదే విధంగా మెట్రో స్టేషన్ నుంచే ఎంఎంటీఎస్ స్టేషన్లలోకి చేరుకునే విధంగా వీటిని ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు ఎంఎంటీఎస్ స్టేషన్ల సమీపానికి బస్టాండ్లను తరలించాలని నిర్ణయించారు.
హైదరాబాద్ వాసుల కు ప్రయోజనం కలిగేలా కొత్త ప్రణాళిలకలు సిద్దం అవుతున్నాయి. యూని ఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు అథారిటీ (ఉమ్టా) అధ్యయనం మేరకు ఈ ప్రతిపాదనలకు తుది రూపు ఇస్తున్నారు. అందులో భాగంగా సికింద్రాబాద్ నార్త్, సౌత్, నాంపల్లి, బేగంపేట, భరత్‌నగర్, మలక్‌పేట, ఖైరతాబాద్ వంటి రద్దీ ప్రాంతాల్లో ఎంఎంటీఎస్.. మెట్రో స్టేషన్లు దగ్గర దగ్గరగానే ఉన్నా.. చాలా చోట్ల స్టేషన్లలోకి స్కైవేలు లేవు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, ఎంఎంటీఎస్, సమీప బస్టాప్‌లను అనుసంధానం చేసేలా త్వరలో స్కైవేను నిర్మించేందుకు నిర్ణయించారు. మొత్తం 51 ఎంఎంటీఎస్ స్టేషన్లలో 21 మాత్రమే బస్టాప్‌లకు కూతవేటు దూరంలో ఉన్నాయి. మిగిలినవి దూరంగా ఉండటంతో ప్రయాణీకులకు ఇబ్బందిగా మారుతోంది. దీంతో.. బస్టాప్ ల నుంచి ఎంఎంటీఎస్ – మెట్రో స్టేషన్లలోకి చేరుకునే విధంగా కొత్త నిర్మాణాలకు ప్రణాళికలు సిద్దం చేసారు.
అందులో భాగంగా అనుసంధానం కోసం రోడ్లు.. స్కైవాక్ నిర్మాణం చేపట్టనున్నారు. ప్రయాణీకుల ను బస్టాప్స్ కే చేర్చేందుకు తక్కువ ఛార్జీలతో ప్రయాణం సాగించే బ్యాటరీ వెహికల్స్ ఏర్పాటు చేయనున్నారు. ఆర్టీసీ బస్సుల్లో రోజుకు 25 లక్షల మంది ప్రయాణాలు చేస్తున్నారు. కాగా, మెట్రో లో 5 లక్షల మంది ప్రయాణం చేస్తున్నట్లు లెక్కలు తేల్చారు. స్కైవేల నిర్మాణానికి భూముల బదిలీ సహా ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి అనుమతులు రావటంతో.. పనులను వేగవంతం చేసేందుకు కసరత్తు జరుగుతోంది. స్కైవే నిర్మాణంతో జిల్లాల నుంచి హైదరాబాద్ వచ్చే వారి ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. దీంతో రైల్వే స్టేషన్లు, మెట్రో, బస్టాప్‌ల సేవలకు ఎంఎంటీఎస్ సేవలతో అనుసంధానం ఏర్పడుతుంది. పాదచారులకు సైతం ఈ కొత్త నిర్ణయం మేలు చేస్తుందని అధికారులు చెబుతున్నారు.



































