సిగరెట్లు, బీడీలు తాగే అలవాటు మీకు ఉందా..? అయితే వాటికి మీరు ఖర్చు పెట్టే బడ్జెట్ భారీగా పెరగనుంది. ఎందుకంటే త్వరలో సిగరెట్లు, బీడీలు, పాన్ మసాలా ధరలు భారీగా పెరగనున్నాయి.
పొగాకు ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పెంచడం, దీనికి సంబంధించి ఇటీవల పార్లమెంట్ ఉభయ సభల్లో ఎక్సైజ్ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించడంతో వాటి ధరలు ఆమాంతం పెరగనున్నాయి. ఫిబ్రవరి 1 నంచి కొత్త జీఎస్టీ రేట్లను కేంద్రం అమలు చేయనున్నట్లు నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. దీంతో ఫిబ్రవరి నుంచి ధరలు ఆకాశాన్నంటనున్నాయి. దీంతో సిగరెట్ తాగాలంటే ఇక పెద్ద మొత్తంలో వదిలించుకోవాల్సిందే.
ఎక్సైజ్ సుంకం భారీగా పెంపు
పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం 25 శాతం నుంచి 100 శాతానికి పెరగనుంది. సిగరెట్లపై వెయ్యి కర్రలకు రూ.200 నుంచి రూ.735 వరకు ఎక్సైజ్ సుంకం పెరగనుంది. సిగరెట్ రకం, పొడవును బట్టి ఈ ధర రూ.2,700 నుంచి రూ.11 వేల వరకు ఉంటుంది. దీని వల్ల సిగరెట్లు, సిగార్లు, గుట్కా, నమిలే పొగాకు లాంటి ధరలన్నీ ఊహించనంతగా పెరగనున్నాయి. ఇక నమిలే పొగాకుపై పన్నులు 25 శాతం నుంచి 100 శాతం వరకు, గుట్కా, పొగాకుపై 25 శాతం నుంచి 40 శాతం వరకు, ధూమాపానం కోసం ఉపయోగించే పైపులు, పొగాకు మిశ్రమాలపై 60 శాతం నుంచి 300 శాతం వరకు పన్ను రేట్లు పెరగనున్నాయి.
సిగరెట్ ధర ఎంత పెరుగుతుందంటే..?
జీఎస్టీ, ఎక్సైజ్ సుంకం రేట్లు పెంచడం వల్ల ప్రస్తుతం రూ.18గా ఉన్న సిగరెట్ ధర ఏకంగా రూ.72కు పెరుగుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో సిగరెట్ తాగాలంటే ఇక ఆలోచించాల్సిందే. ఇప్పటివరకు ఒక్కొ సిగరెట్ ధర రూ.20లోపే ఉంటుండటంతో తక్కువ ధరే కదా అని చాలామంది తాగుతున్నారు. కొత్తగా దీనిని చాలామంది అలవాటు చేసుకుంటున్నారు. ఇప్పుడు భారీగా రేట్లు పెరగనుండటంతో సిగరెట్ తాగాలంటే భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీంతో చాలామంది అలవాటు మానుకునే పరిస్థితి కూడా ఏర్పడే అవకాశముంది. ఎక్పైజ్ సుంకం, జీఎస్టీ రేట్లు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానుండటంతో కంపెనీలన్నీ సిగరెట్ల ధరలను పెంచేందుకు సిద్దమవుతున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి మారిన సిగరెట్ల ధరలను మనం చూడవచ్చు.

































