గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆర్థిక శక్తిని పెంచి, వారిని స్వయం సమృద్ధి వైపు నడిపించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం డ్వాక్రా గ్రూపులను (Development of Women and Children in Rural Areas – DWCRA) 1982లో ప్రారంభించింది.
ఈ పథకం ద్వారా మహిళలను చిన్న చిన్న సంఘాలుగా ఏర్పరచి.. ఆర్థిక సహాయం, శిక్షణ, మార్కెట్ సౌకర్యాలు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ తర్వాత స్వయం సహాయక సంఘాలు (Self Help Groups – SHGs) డ్వాక్రా ఆధారంగా అభివృద్ధి చెందాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వీటికి మరింత బలమైన మద్దతు అందించింది. తాజాగా 32 జిల్లాలకు చెందిన 4,079 స్వయం సహాయక సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ కింద రూ. 6,11,85,000 విడుదల చేస్తూ సెర్ప్ సీఈఓ దివ్యదేవరాజన్ ఉత్తర్వుల జారీ చేశారు.
దీని ద్వారా ఒక్కో సంఘానికి రూ. 15,000 చొప్పున ఈ నిధులు పంపిణీ చేయనున్నారు. ఈ మొత్తం వినియోగాన్ని పర్యవేక్షించే బాధ్యతను జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులకు అప్పగించారు. దసరా పండుగ కంటే ముందే ఈ నిధులు విడుదల కావడంతో డ్వాక్రా సంఘాల సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తమకు దసరా కానుకగా ఈ నిధులు విడుదల చేశారని మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. మహబూబాబాద్ జిల్లాకు అత్యధికంగా 397 సంఘాలకు నిధులు అందనుండగా.. తర్వాత స్థానంలో జోగులాంబ గద్వాల నిలిచింది. ఇక మంచిర్యాలలో కేవలం 3 సంఘాలకు మాత్రమే ఆర్థిక సహాయం చేరనుంది.
డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలు చిన్న స్థాయి వ్యాపారాలు ప్రారంభించేందుకు సహాయం పొందుతున్నారు. పశుపోషణ, కుట్టు యంత్రాలు, పాపడ్ తయారీ, మసాలా పొడి ఉత్పత్తులు, హస్తకళ ఉత్పత్తులు వంటి వాటిని చేపట్టే అవకాశం కలుగుతోంది. అలాగే మహిళలకు బ్యాంకుల ద్వారా సులభ రుణాలు, తక్కువ వడ్డీపై రుణ సదుపాయం, శిక్షణా కార్యక్రమాలు, మార్కెట్ లింకేజీలు అందించడం జరుగుతోంది.
ఈ విధంగా కుటుంబ ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో డ్వాక్రా గ్రూపులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రభుత్వం మహిళా సంఘాలకు పలు ఇతర సౌకర్యాలు కూడా కల్పిస్తోంది. ‘స్త్రీ నిధి’ పథకం ద్వారా తక్షణ రుణ సదుపాయం.. పింఛను, బీమా వంటి సహాయక చర్యలు అమలవుతున్నాయి. అదనంగా.. మహిళా శిక్షణా కేంద్రాల ద్వారా వారికి ఆర్థిక సాక్షరత, వ్యాపార నిర్వహణలో అవగాహన కల్పిస్తున్నారు.
డ్వాక్రా, ఎస్‌హెచ్‌జీల బలంతో తెలంగాణ మహిళలు ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక వృద్ధిలో భాగస్వాములు అవుతున్నారు. స్వయం ఉపాధి అవకాశాలతో పాటు సామాజిక గౌరవం, కుటుంబ స్థాయిలో నిర్ణయాధికారాన్ని కూడా పొందుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఆర్థిక సహాయం వారిని మరింత స్థిరత్వం వైపు నడిపిస్తోంది.
































