రూటు మార్చిన చంద్రబాబు – కీలక నిర్ణయం

www.mannamweb.com


ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అవుతోంది. దీంతో, ఇక పాలనా పరంగా వేగంగా నిర్ణయాలు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు తమ ప్రాధాన్యతాంశాల ను స్పష్టం చేసారు.

అధికారుల వ్యవహార శైలిలోనూ మార్పు రావాలని సూచన చేసారు. ఇదే సమయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కలెక్టర్లు, ఎస్పీలతో రెండు రోజుల సమావేశానికి నిర్ణయించింది. పాలనా పరంగా దిశా నిర్దేశానికి సిద్దమైంది.

కలెక్టర్ల సదస్సు

ఏపీ ప్రభుత్వం కలెక్టర్ల సదస్సుకు షెడ్యూల్ ఖరారు చేసింది. డిసెంబరు 3, 4 తేదీల్లో ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు పూర్తవుతోంది. దీంతో, పాలనా పరంగా ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలు.. అమలు పైన సమీక్ష చేయటంతో పాటుగా కొత్త లక్ష్యాలను నిర్దేశించనున్నారు. తొలి కలెక్టర్ల సమావేశంలో ఇచ్చిన అజెండా అమలు పైన చర్చ జరగనుంది. అదే విధంగా అభివృద్ధి – సంక్షేమం పైన ఈ సమావేశంలో ప్రభుత్వం అధికారులకు దిశా నిర్దేశం చేయనుంది. ఈ సారి కలెక్టర్ల సమావేశ అజెండాలో భూ రికార్డుల పునఃపరిశీలన, నూతన పరిశ్రమల ఏర్పాటు ప్రధాన అంశాలుగా ఉండనున్నాయి. అదే సమయంలో వ్యవసాయం, నీటి పారుదల అంశాల పైన ప్రత్యేకంగా చర్చించనున్నారు.

దిశా నిర్దేశం

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కీలక శాఖల పైన శ్వేత పత్రాలు విడుదల చేసారు. అదే సమయంలో తమ లక్ష్యాలను స్పష్టం చేసారు. తొలి ఆరు నెలల కాలంలో సాధించిన పురోగతి.. ఫలితాల పైన సమీక్ష చేయనున్నారు. కలెక్టర్ల సమావేశంలో రెండో రోజు ఎస్పీలతోనూ సమావేశం నిర్వహించనున్నారు. శాంతి భద్రతల విషయం ఇప్పుడు ప్రభుత్వానికి ప్రతిష్ఠాత్మకంగా మారింది. దీంతో, ఈ సమావేశంలో గంజాయి, మాదకద్రవ్యాల కట్టడి, శాంతిభద్రతలు, సోషల్‌మీడియా పోస్టింగ్స్ లో కఠినంగా వ్యవహరించాలని నిర్దేశం చేయనున్నారు. ఇక, భూముల పైన పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తుండటంతో భూ రికార్డుల పరిశీలన..ఫిర్యాదుల పరిష్కారం పైన ప్రభుత్వం కీలక సూచనలు చేసే అవకాశం కనిపిస్తోంది.

కార్యాచరణ ఖరారు

ఈ పారి తమ పాలన పూర్తిగా పొలిటికల్ గవర్నెన్స్ లోనే ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేసారు. అదే సమయంలో హామీల అమలు కోసం క్షేత్ర స్థాయిలో అమలు పైన ప్రభుత్వం కలెక్టర్లకు మార్గనిర్దేశం చేయనుంది. పాలనా పరమైన లక్ష్యాలను అందుకోవటంలో రూటు మార్చిన చంద్రబాబు.. ఇక కఠినంగానే ఉంటానని ఇప్పటికే స్పష్టం చేసారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ సైతం అధికారులకు పలు సూచనలు చేయనున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు మరింత పక్కాగా అమలయ్యేలా ఈ రెండు రోజుల సదస్సు ద్వారా ప్రభుత్వం కార్యాచరణ ఖరారు చేయనుంది.