గేట్‌ 2026 అభ్యర్ధులకు కీలక అప్‌డేట్.. మరికాసేపట్లోనే అడ్మిట్‌ కార్డులు విడుదల

 గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (GATE) 2026 పరీక్షరాసే అభ్యర్థులకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) గువహటి మరో కీలక అప్‌డేట్ జారీ చేసింది.


ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు శుక్రవారం (జనవరి 2వ తేదీన) విడుదల చేయనున్నట్లు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) గువాహటి ప్రకటించింది. గేట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ లో తమ వివరాలు నమోదు చేసి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

కాగా ఇప్పటికే ఐఐటీ గువహటి టెస్ట్‌ పేపర్ల వారీగా పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఫిబ్రవరి 7, 8, 14, 15 తేదీల్లో ఆయా సబ్జెక్టులకు ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు నిర్వహించనుంది. ఆయా తేదీల్లో రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలు జరుగుతాయి. మొదటి సెషన్‌ ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంట వరకు, రెండో సెషన్ పరీక్షలు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు నిర్వహించనున్నారు.

దేశంలోని ఐఐటీలు సహా పలు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఎంటెక్‌, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (GATE) పరీక్షను యేటా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 30 పేపర్లలో ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. బీటెక్‌తోపాటు బీఎస్సీ, బీఏ, బీకాం విద్యార్థులు కూడా ఈ పరీక్షలు రాయవచ్చు. పరీక్షలో సాధించిన స్కోర్‌కు ఫలితాలు వెలువడినప్పటి నుంచి వరుసగా మూడేళ్లపాటు గేట్‌ స్కోర్‌కు విలువ ఉంటుంది. ఆ స్కోర్‌తో మూడేళ్లలో ఎంటెక్‌ తదితర కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చు. అభ్యర్ధులు గరిష్ఠంగా 2 పేపర్ల వరకు పరీక్ష రాయవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.