దేశంలో ఎక్కడా లేనన్ని ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు తెలంగాణలో ఉన్నాయి. సమయానికి ఇవ్వాల్సిన చెల్లింపులు, బకాయిలతోపాటు కరువు భత్యం, పీఆర్‌సీ, పెండింగ్ బిల్లులు వంటివి చెల్లించకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
చివరకు ఉద్యోగ విరమణ పొందిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై ధర్నాకు దిగారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రభుత్వం, ప్రజలకు మధ్య అనుసంధానంగా ప్రభుత్వ ఉద్యోగులు సేవలు అందించారు. గౌరవంగా ఉద్యోగులకు వీడ్కోలు పలకాల్సిన ప్రభుత్వం తమను అవమానించేలా వ్యవహరిస్తోందని రిటైర్డ్ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ఉద్యోగంలో నుంచి దిగిపోయే రోజే అన్నీ చెల్లింపులు చేయాల్సి ఉండగా.. ఏడాది, రెండేళ్లు గడిచినా ఇప్పటివరకు ఆర్థిక ప్రయోజనాలు ప్రభుత్వం చెల్లించడం లేదు. దీంతో జిల్లాల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు.
ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. ఈ క్రమంలోనే తమ రిటైర్మెంట్ బెనిఫిట్స్, డీఏ పెంపు, పెండింగ్ బిల్స్ కోసం భారీ ధర్నాకు దిగారు. కామారెడ్డి పట్టణంలో విశ్రాంత ఉద్యోగులు బుధవారం నిరసన చేపట్టారు. రిటైర్డ్ ఉద్యోగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నదని మాజీ ఉద్యోగులు మండిపడ్డారు. న్యాయబద్ధంగా రావాల్సిన ప్రయోజనాలు, బకాయిలను విడుదల చేయకుండా తీవ్ర మానసిక ఆందోళనకు గురిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో విశ్రాంత ఉద్యోగులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 20 నెలలుగా రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలను రేవంత్ రెడ్డి విడుదల చేయకపోవడంతో కొంతమంది మానసిక ఆవేదనతో చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 2024 మార్చి నుంచి ఇప్పటివరకు రిటైర్ అయిన ఉద్యోగుల బకాయిలను చెల్లించకుండా రేవంత్ రెడ్డ మొండి వైఖరి అవలంభిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ పిల్లల పెళ్లిళ్లు చేయలేక, ఇళ్లు కట్టుకోలేక, చేసిన అప్పులు తీర్చలేక కుంగిపోతున్నారని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు వాపోయారు. వెంటనే రేవంత్ రెడ్డి స్పందించి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి బిల్లులు, ఆర్థిక ప్రయోజనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కాగా ఇప్పటికే ఐదు డీఏలు, డీఆర్‌లు రేవంత్ రెడ్డి బకాయిపడ్డాడని గుర్తుచేశారు.


































