ఏపీలో స్ధానిక సంస్థలకు భారీ షాక్..! ఆ నిధులు వాడకుండా బ్రేక్ ?

పీలోని గ్రామ స్ధానిక సంస్థల్లో సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. 15వ ఆర్ధికసంఘం నిధుల వాడకం విషయంలో తాజాగా అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు.


దీంతో ఈ నిధులపై భారీ ఆశలు పెట్టుకున్న వారికి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఈ మేరకు తదుపరి ఆదేశాల కోసం వారు ఎదురుచూడాల్సిన పరిస్ధితి నెలకుంటోంది. దీంతో గ్రామ స్ధానిక సంస్థల ప్రతినిధులు గగ్గోలు పెడుతున్నారు.

రాష్ట్రంలోని పంచాయతీల్లో, మండల పరిషత్తుల్లో సర్పంచ్ లు, ఎంపీపీలు ఇప్పటికే విడుదల చేసిన 15వ ఆర్ధికసంఘం నిధులు వాడకుండా అడ్డుకోవాలని అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. దీంతో తదుపరి ఆదేశాలు వెలువడే వరకు పంచాయతీల్లో 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం నిలిపివేయాలని పంచాయతీలు, మండల పరిషత్లను ఆదేశిస్తూ పలు జిల్లాల్లో అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. వీటిని తప్పనిసరిగా పాటించాలని, తమ ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

దీని వెనుక ఓ కీలక కారణం కనిపిస్తోంది. రాష్ట్రంలో సర్పంచ్ లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల పదవీకాలం మరో మూడు నెలల్లో ముగియనుంది. దీంతో ఆర్థిక సంఘం నిధులను ఖాతాల్లో నుంచి ఖాళీ చేసేందుకు పంచాయతీల్లో సర్పంచులు ప్రయత్నాలు చేస్తున్నారు. పాత పనుల బిల్లులు చెల్లించాలని కార్యదర్శులపై కొన్ని చోట్ల సర్పంచులు ఒత్తిడి చేస్తున్నారని తెలుస్తోంది. అలాగే చేయని పనులకూ బిల్లులు సృష్టిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కార్యాలయం అలర్ట్ అయింది.

జిల్లాపరిషత్ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులతో తాజాగా నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో ఆర్థిక సంఘం నిధుల వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశాలు వెళ్లాయి. గ్రామ స్ధానిక సంస్థలకు ఎలాంటి బిల్లులూ చెల్లించవద్దని ఉన్నతాధికారులు కార్యదర్శుల్ని ఆదేశించారు. అలాగే మళ్లీ ఆదేశాలిచ్చే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని సూచించారు. దీంతో వారు ప్రభుత్వ ఆదేశాల్ని అమలు చేయడం ప్రారంభించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.