ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి సర్వేకు సిద్ధమైంది. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే (UFS) పేరుతో ప్రజల నుంచి మరోసారి డేటాను సేకరిస్తోంది. రాష్ట్రవ్యాప్తగా నేటి నుంచి గ్రామ సచివాలయం, వార్డు సచివాలయ ఉద్యోగులు ఈ ఫ్యామిలీ సర్వే నిర్వహిస్తున్నారు.
ఈ మేరకు ప్రభుత్వం Unified Family Survey (UFS) యాప్‌ను కూడా తీసుకొచ్చింది. ఈ సర్వేలో భాగంగా కుటుంబాల సమగ్ర సమాచారాన్ని ప్రభుత్వం నమోదు చేస్తుంది. కుటుంబ ఆర్ధిక, సామాజిక, విద్యా, ఉద్యోగ సంబంధందించిన సమాచారాన్ని ప్రజల నుంచి సేకరిస్తారు. దాదాపు నెలా పాటూ ఈ సర్వే కొనసాగనుంది. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ప్రతి ఇంటికి వెళ్లి, కుటుంబంలోని ప్రతి వ్యక్తి సమాచారాన్ని సేకరిస్తారు. డేటా తీసుకున్న తర్వాత E-KYC చేయిస్తారు.. అప్పుడు సర్వే ముగుస్తుంది.
ఈ సర్వే ద్వారా సేకరించిన డేటాతో ప్రభుత్వ పథకాలు సరైన అర్హులకు చేరేందుకు ఉపయోగంగా ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు ప్రభుత్వం ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ జారీ చేయడానికి సులభంగా ఉంటుందంటున్నారు. భవిష్యత్ సంక్షేమ పథకాలైన అన్నదాతసుఖీభవ, తల్లికి వందనం సహా ఇతర పథకాలు కూడా ఈ డేటాపైనే ఆధారపడి ఉంటుందట. ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా E-KYC ఆధారంగా వ్యక్తిగత + కుటుంబ స్థాయి వివరాల సేకరణ ఉంటుందని చెబుతున్నారు. ఈ సర్వేలో ప్రధానంగా ఆధార్, మొబైల్, విద్య, ఉపాధి, ఆదాయం, ఆస్తులు, గృహ వివరాలు, సామాజిక & కుటుంబ మ్యాపింగ్ సమాచారం సేకరిస్తారు. ఈ సర్వే డిసెంబర్ 15న ప్రారంభమై.. జనవరి 12 వరకు కొనసాగుతుందని చెబుతన్నారు.
ఈ సర్వే విషయంలో కొన్ని ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. సర్వే జరిగే సమయంలో కుటుంబసభ్యులు అందుబాటులో లేకపోతే పరిస్థితి ఏంటి.. ఎందుకంటే చాలామంది ఉపాధి కోసం వేర్వేరు, వేర్వేరు ప్రాంతాలకు వెళుతున్నారు. ఈ క్రమంలో వారి డేటాను ఎలా సేకరిస్తారన్నది చూడాలి. E-KYC కూడా ఉండటంతో అందుబాటులో లేని వారి పరిస్థితి ఏంటి.. సర్వే సమయంలో కుటుంబంలో సభ్యులందరూ ఉండాలా, ఒక్కరు ఉంటే సరిపోతుందా అనేది కూడా తెలియాల్సి ఉంది. దీనిపై అధికారులు త్వరలోనే స్పష్టత ఇస్తే బావుంటుంది అంటున్నారు. అలాగే ఈ సర్వే తర్వాత అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఉచిత గ్యాస్.. ఇలా అన్ని సంక్షేమ పథకాల్లో ఎవరైనా అనర్హులు ఉన్నా తెలిసిపోతుంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఈ సర్వేను నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ప్రజలు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులతో మాట్లాడి అన్ని వివరాలు తెలుసుకుని.. ఆ తర్వాత ఈ సర్వేను చేయించుకోవడం మంచిది.


































