భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతోంది మేడారం. ఇక్కడ మహా జాతర వైభవంగా జరుగుతుంది. తెలంగాణ, ఏపీనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు వచ్చి సమ్మక్క, సారక్కలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు.
ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరోయిన్ టీనా శ్రావ్య చేసిన ఓ పని తీవ్ర వివాదానికి దారి తీసింది. చివరకు ఆమె సారీ చెప్పాల్సి వచ్చింది.
టీనా శ్రావ్య వివాదం
మేడారంలో అమ్మవార్లకు మొక్కుగా భక్తులు బంగారం (బెల్లం) చెల్లించుకుంటారు. తులాభారం వేస్తారు. అంటే మొక్కిన వాళ్లు తమ బరువున్న బెల్లాన్ని తూకం వేయించుకుని, అమ్మవార్లకు సమర్పిస్తారు. హీరోయిన్ టీనా శ్రావ్య కూడా మొక్కు చెల్లించుకుంది. కానీ తన పెంపుడు కుక్కకు ఆమె తులాభారం వేసి, బెల్లం సమర్పించడమే ఇక్కడ వివాదానికి దారి తీసింది.
భక్తులు ఫైర్
మేడారంలో తన పెంపుడు కుక్కకు టీనా శ్రావ్య తులాభారం వేయించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. దీంతో భక్తులు టీనా శ్రావ్యపై మండిపడ్డారు. భక్తుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారని, ఇది కచ్చితంగా అవమానించడమేనని, ఇలా కుక్కకు ఎవరైనా తులాభారం వేసి మొక్కు తీర్చుకుంటారా అని టీనాపై మండిపడ్డారు. ఇది పెద్ద వివాదానికి కారణమైంది.
సారీ చెప్పిన టీనా
మేడారం జాతరలో భాగంగా అమ్మవార్లకు మొక్కు సమర్పించుకునే క్రమంలో తన పెంపుడు కుక్కకు తులాభారం వేసినందుకు టీనా శ్రావ్య సారీ చెప్పింది. కమిటీ కుర్రోళ్లు, ది గ్రేట్ ప్రి వెడ్డింగ్ షో సినిమాల్లో టీనా శ్రావ్య నటించింది.
”అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లారిటీ ఇవ్వడానికి, క్షమాపణ తెలపడానికి చేస్తున్నా. నేను పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయ్యాక తెలిసింది అది కరెక్ట్ కాదు అని. నా కుక్కకు 12 ఏళ్లు. దానికి ట్యూమర్ సర్జరీ అయింది. అది కోలుకోవాలని అమ్మను మొక్కుకున్నా. అది కోలుకుని, నడుస్తుంది” అని వీడియోలో టీనా పేర్కొంది.
మొక్కు చెల్లించాలని
”మొక్కు చెల్లించాలని కుక్కకు బంగారు తూకం వేశాం. అది నేను ప్రేమతో, భక్తితో మాత్రమే చేశా. ఇంకేం ఉద్దేశించి కానీ ఎవరినీ కించ పరచాలని కానీ చేయలేదు. మన మేడారం జాతర సంప్రదాయం ప్రకారం, గిరిజనుల ఆచారం ప్రకారం అది తప్పు అని తెలుసుకున్నా. నేను చేసిన పొరపాటు వల్ల ఎవరైనా హర్ట్ అయి ఉంటే సారీ. ఇలాంటి పొరపాట్లు మళ్లీ జరగవు. ఈ విషయాన్ని ఇక్కడితో ముగించాలని కోరుకుంటున్నా”

































