టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తాత, దివంగత ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తండ్రి ఈదర వెంకట్రావు (90) కన్నుమూశారు.
వృద్ధాప్య సమస్యలతో పాటు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వెంకట్రావు, ఉదయం సుమారు మూడు గంటల సమయంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ వార్తతో అల్లరి నరేష్ కుటుంబంతో పాటు యావత్ తెలుగు సినీ పరిశ్రమలో విషాద వాతావరణం నెలకొంది.
పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం కోరుమామిడి గ్రామానికి చెందిన వెంకట్రావు, సాధారణ రైతు కుటుంబ నేపథ్యంతో జీవితం ప్రారంభించినప్పటికీ, తన పిల్లల విద్యాభ్యాసం, సంస్కారాలు, విలువలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తిగా కుటుంబ సభ్యులు గుర్తుచేసుకుంటున్నారు. ఆయన అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు కోరుమామిడి గ్రామంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.
వెంకట్రావు పెద్ద కుమారుడు ఈవీవీ సత్యనారాయణ తెలుగు సినీ పరిశ్రమలో తనదైన హాస్యశైలితో అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాలను తెరకెక్కించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. వెంకట్రావు సతీమణి వెంకటరత్నం 2019లో పరమపదించగా, పెద్ద కుమారుడు ఈవీవీ సత్యనారాయణ 2011లో కన్నుమూశారు. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. రెండో కుమారుడు ఈవీవీ గిరి, మూడో కుమారుడు ఈవీవీ శ్రీనివాస్ కాగా, కుమార్తె ముళ్లపూడి మంగాయమ్మ. ఈవీవీ సత్యనారాయణ కుమారులైన అల్లరి నరేష్ మరియు ఆర్యన్ రాజేష్ సినీ రంగంలో కొనసాగుతున్నారు. తాత మరణంతో ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ వారు తీవ్ర దిగ్భ్రాంతి, వేదన వ్యక్తం చేశారు.
అల్లరి నరేష్ కెరీర్ విషయానికి వస్తే.. తన సినీ ప్రయాణంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ, ప్రయోగాత్మక చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ప్రారంభ దశలో పూర్తిస్థాయి కామెడీ పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నరేష్.. ‘గమ్యం’, ‘శంభో శివ శంభో’, ‘బెండు అప్పారావు ఆర్‌ఎంపీ’ వంటి చిత్రాలలో నటనలో వైవిద్యం చూపించారు. ఇటీవల ‘నాంది’, ‘ఉగ్రం’, ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’, ‘బచ్చలమల్లి’ వంటి సినిమాలు చేశారు.


































