ఆంధ్రప్రదేశ్‌లోని అంతర్వేది బీచ్ సమీపంలో నూతన సంవత్సరం(NewYear Accident) వేడుకలు విషాదంగా మారాయి. కాకినాడకు చెందిన ముగ్గురు యువకులు న్యూ ఇయర్ సెలబ్రేషన్ల సందర్భంగా థార్ కారులో బీచ్ ప్రాంతంలో డ్రైవ్ చేస్తున్నారు.
ఈ క్రమంలో అన్నాచెల్లెళ్ల గట్టు సమీపంలో ఉన్న ప్రమాదకరమైన మలుపును సరిగా గమనించకపోవడంతో వాహనం అదుపుతప్పి నేరుగా సముద్రంలోకి దూసుకెళ్లింది.
ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న ఒక యువకుడు(NewYear Accident) సమయస్ఫూర్తితో బయటకు దూకి ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే మరో యువకుడు వాహనంతో పాటు సముద్రంలోకి కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. మూడో యువకుడి పరిస్థితిపై స్పష్టమైన సమాచారం అందలేదు.
ఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించి, తమ స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు. సముద్రపు అలలు ఉద్ధృతంగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడినట్లు తెలుస్తోంది. పోలీసు, రెస్క్యూ బృందాలు ఘటనపై విచారణ చేపట్టినట్లు సమాచారం. బీచ్ ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా వాహనాల డ్రైవింగ్ ప్రమాదాలకు దారి తీస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. పర్యాటకులు, యువత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.


































