జైపూర్‌కు చెందిన ఒక వ్యక్తి పెళ్లి కార్డును నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్లాడు.
ఇంతవరకు ఎవరూ చేయని విధంగా వివాహ పత్రికను తయారు చేయించాడు. ఈ పెళ్లి పత్రిక తయారీకి అతడు ఏం వాడాడో, ఎంత ఖర్చు చేశాడో తెలిస్తే.. అవాక్కవ్వాల్సిందే. వెడ్డింగ్ కార్డ్ తయారీ కోసం అతడు 3 కిలోల స్వచ్చమైన వెండిని వాడాడు. ఇందుకోసం అతడు ఏకంగా 25 లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. అతడి పేరు శివ్ జోహ్రీ. తన కూతురు శ్రుతి జోహ్రీ పెళ్లి కోసం 3 కేజీల ప్యూర్ సిల్వర్ తో ఒక ప్రత్యేకమైన వెడ్డింగ్ కార్డ్ ను రూపొందించాడు. ఇందుకోసం 128 పీసులు వాడారు. ఒక్క మేకు లేదా స్క్రూ వాడకుండా కళాత్మక నైపుణ్యంతో 128 పీసులను అతికించడం విశేషం.
కార్డు తయారీకి రూ.25 లక్షలు ఖర్చు..
శివ్ జోహ్రీ జైపూర్‌కు చెందిన ప్రముఖ నగల వ్యాపారి. కూతురి పెళ్లిని అంతా గుర్తుంచుకునేలా చేయాలని అతడు డిసైడ్ అయ్యాడు. అందుకోసం 3 కేజీల స్వచ్ఛమైన వెండితో ఓ పెట్టె ఆకారంలో పెళ్లి పత్రికను రూపొందించాడు. ఈ ఒక్క కార్డ్ తయారీ కోసం అతడు ఏకంగా 25 లక్షల రూపాయలు ఖర్చు చేశాడంటే విస్తుపోవాల్సిందే. ఈ వెరైటీ కార్డ్ తయారీకి ఏడాది సమయం పట్టింది.
కార్డుపై 65మంది దేవతా మూర్తుల ప్రతిమలు..
ఇంకా చెప్పాలంటే.. ఇది వెడ్డింగ్ కార్డు కాదు.. ఒక ఆధ్యాత్మిక కళాఖండం. ఈ పెళ్లి పత్రికపై దేవుళ్ల బొమ్మలు ఉన్నాయి. వినాయకుడు, పార్వతి దేవి, శివుడు, లక్ష్మీ నారాయణులు కొలువై ఉన్నారు. మొత్తంగా 65 మంది దేవతా మూర్తుల ప్రతిమలను చెక్కారు. కృష్ణుడి బాల్య లీలలు, విష్ణుమూర్తి దశావతారాలు, అష్టలక్ష్ములు, తిరుమల బాలాజీ రూపాలనూ పొందుపరిచారు. కార్డు మధ్యలో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు (హర్ష్ సోనీ, శ్రుతి జోహ్రీ) పేర్లు ఉన్నాయి. పరిచారకులు, రథసారధులు, దీపాలతో ఉన్న దేవతలు, శంఖం, డప్పులు వాయిస్తున్న దేవతలను కూడా చెక్కారు. 8 x 6.5 అంగుళాలు.. 3 అంగుళాల లోతుతో ఈ కార్డుని రూపొందించారు.
“ఈ కార్డును నేనే ఒక సంవత్సరం పాటు తయారు చేశాను. నా కూతురి పెళ్లికి బంధువులనే కాకుండా అందరు దేవుళ్ళు, దేవతలను కూడా ఆహ్వానించాలని కోరుకున్నాను. నా బిడ్డకు తరతరాలుగా ఆమెతో నిలిచి ఉండేలా, భవిష్యత్తు తరాలు చూసి గుర్తుంచుకునేలా ఏదైనా కానుక ఇవ్వాలని నేను అనుకున్నాను” అని శివ్ జోహ్రీ తెలిపాడు. “ఆరు నెలల ఆలోచన తర్వాత, మేము ఈ ప్రత్యేకమైన వస్తువును సృష్టించాలని నిర్ణయించుకున్నాము. దాన్ని సిద్ధం చేయడానికి నేను ఒక సంవత్సరం పాటు దానిపై పనిచేశాను” అని చెప్పాడు.
సోషల్ మీడియాలో వైరల్..
దేవతా మూర్తుల ప్రతిమల మధ్య వధువు, వరుడి పేర్లు చెక్కబడి ఉన్నాయి. వారి పేర్ల చుట్టూ ఏనుగులు పూల వర్షం కురిపిస్తున్నట్లుగా ఉంది. ఇక లోపల సాంప్రదాయ ఆహ్వానం ప్రతిబింబిస్తుంది. వధువు, వరుడి తల్లిదండ్రులు, మొత్తం కుటుంబం పేర్లు చెక్కబడి ఉన్నాయి. ఇప్పుడీ సిల్వర్ వెడ్డింగ్ కార్డ్ జైపూర్ లో హాట్ టాపిక్ గా మారింది. అటు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతా దీని గురించే డిస్కస్ చేసుకుంటున్నారు.

































