రాజకీయాలు రాజకీయాలు మాదిరిగానే చేయాలి. వాటిని పగ, ప్రతీకారాలకు ఉపయోగిస్తే మొన్నటి ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయి. అప్పటివరకు జగన్( Y S Jagan Mohan Reddy ) పరిస్థితి బాగుంది.
ఏనాడైతే చంద్రబాబును( Chandrababu) జైల్లో పెట్టించాడో అప్పుడే సీన్ మారింది. తట్టస్తుల్లో మార్పు వచ్చింది. ప్రజల్లో ఆలోచన మొదలైంది. జగన్ కు అంతులేని నష్టం కలిగింది. జగన్ చిన్నపాటి లాజిక్ మిస్సయ్యారు. తన విషయంలో ఎదురైన పరిస్థితులను గుర్తు చేసుకోలేకపోయారు. కేవలం జగన్ ను జైల్లో పెట్టించడం ద్వారా కాంగ్రెస్( Congress Party) పార్టీ మూల్యం చెల్లించుకుంది. జగన్ జైలుకు వెళ్లడం ద్వారా నాయకుడు అయ్యారు. ప్రజల్లో గుర్తింపు సాధించారు. ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నేత కాగలిగారు. తరువాత ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు. నాడు జైలుకు వెళ్ళకపోతే ఒక విజయభాస్కర్ రెడ్డి కుమారుడు మాదిరిగా.. ఒక నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు మాదిరిగా మిగిలిపోయి ఉండేవారు.
* అటువంటి ప్రయత్నాలు సఫలం కావు
ఎదుటి పార్టీని నిర్వీర్యం చేస్తామన్న ఏ రాజకీయ పార్టీ ప్రయత్నం సఫలం కాలేదు. అంతెందుకు కాంగ్రెస్ పార్టీని పూర్తిగా నిర్మూలించడానికి బిజెపి( Bhartiya Janata Party) చేయని ప్రయత్నం లేదు. కానీ ఈ క్రమంలో మూడోసారి అతి కష్టం మీద అధికారంలోకి రాగలిగింది బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ( National democratic allowance ). కాంగ్రెస్ పార్టీ అధికారానికి చేరువ కాకపోయినా.. సీట్లు, ఓట్లు పెంచుకుంటూ వచ్చింది. అయితే ఇప్పుడు ఏపీలో వైసీపీని పూర్తిగా నిర్వీర్యం చేయాలన్నది టిడిపి అనుకూల మీడియా అధిపతి ఆర్కే ఆలోచన. ఏడు నెలలు అవుతున్నా ఈ విషయంలో చంద్రబాబు ఫెయిల్ అయ్యారన్నది రాధాకృష్ణ ఆవేదన. ఇలానే ముందుకెళ్తే చంద్రబాబుకు కష్టమని కూడా ఆయన తేల్చి చెప్పారు. విలువైన సలహా ఇచ్చారు. కొత్త పలుకులో పెద్ద హెచ్చరిక జారీ చేశారు. కానీ ఈ విషయంలో చంద్రబాబుకు ఫుల్ క్లారిటీ ఉంది. కానీ ఎందుకో రాధాకృష్ణ మాత్రం జగన్ విషయంలో చంద్రబాబు వెనక్కి తగ్గుతున్నారని.. బిజెపిని సరైన విధానంలో ప్రయోగించడం లేదని చెప్పుకొస్తున్నారు.
* జగన్ మాదిరిగా చేయాలని
జగన్ హయాంలో వ్యవస్థలను వాడుకున్నారని… వ్యవస్థల ద్వారానే రాజకీయ ప్రత్యర్థులపై ప్రతీకారాలకు దిగారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ పని చంద్రబాబు( Chandrababu) ఎందుకు చేయలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో జగన్ కోసం ఓ పదిమంది అధికారులు ఏ పని చేయడానికి అయినా సిద్ధంగా ఉండేవారని.. ఇప్పుడు మాత్రం చంద్రబాబుకు తెలియకుండానే అధికారులు అన్ని పనులు చేస్తున్నారని.. ఇలానే కొనసాగితే చంద్రబాబుకు ముప్పు అని హెచ్చరిస్తున్నారు ఆర్కే. పైగా ఇలాగే ఉదాసీనంగా కొనసాగితే 2029 ఎన్నికల్లో చిన్నబాబు లోకేష్ కు( Nara Lokesh) కష్టమని కూడా గుర్తు చేస్తున్నారు. ఆ ఎన్నికల్లో ప్రధానంగా జగన్, పవన్, లోకేష్ మధ్య పోటీ ఉంటుందని కూడా చెబుతున్నారు. చంద్రబాబుపై జగన్ ప్రతీకార రాజకీయాలు తప్పు. మరి అదే చంద్రబాబు జగన్ పై చేస్తే ఒప్పు అవుతుందా? ఆ పని చేయడం ద్వారా జగన్ మూల్యం చెల్లించుకున్నారు. ఇప్పుడు అదే పని చేయమనడం ద్వారా చంద్రబాబు మూల్యం చెల్లించుకోవాలా? ఈ ప్రశ్నకు మరి రాధాకృష్ణ ఎలాంటి జవాబు చెబుతారో? తనకు ఇష్టమైన బుకాయింపు తో సరి పెడతారో చూడాలి.