మనం రోజూ వివిధ రకాల ఆహార పదార్థాలు తింటాం. వాటిలో ఆమ్ల స్వభావం ఉండేవి, క్షార స్వభావం ఉండేవి కూడా ఉంటాయి. బాగా పుల్లగా ఉండేవి ఎసిడిక్ ఫుడ్స్, వగరుగా ఉండేవాటిని ఆల్కలిన్ ఫుడ్స్‌గా పిలుస్తుంటాం.
రుచి, pH స్థాయులను బట్టి ఏదైనా ఫుడ్ ఆమ్లమా, క్షారమా అని నిర్ణయిస్తారు. సాధారణంగా మన శరీర పీహెచ్ స్థాయులు 7.35 నుంచి 7.45 మధ్య ఉండాలి. కాస్త అటూ, ఇటూ అయినా ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. శరీరం ఎసిడిక్‌గా లేదా ఆల్కలిన్‌గా మారితే బాడీ మెకానిజం అడ్జస్ట్ చేసుకుని బ్యాలెన్స్ చేసుకుంటుంది. కానీ ఎప్పుడూ బాడీ ఎసిడిక్‌గా ఉంటే మాత్రం లంగ్స్, కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడి దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుంది. పది లక్షణాలు మన శరీరం ఎసిడిక్‌గా మారిందని సూచిస్తాయి. అవేంటో చూద్దాం.
* బలహీన రోగనిరోధక శక్తి
ఎసిడిటీ ఎక్కువ కాలం కొనసాగితే ఇన్‌ఫ్లమేషన్‌కి దారితీస్తుంది. సూక్ష్మజీవులపై సమర్థంగా పోరాడే బాడీ ఎబిలిటీని ఈ ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తుంది. దీంతోపాటు బాడీలోని ఆమ్లత్వం ఇమ్యూనిటీ ఫంక్షన్‌ని దెబ్బతీసి జలుబు వంటి ఫ్లూ ఇన్‌ఫెక్షన్లకు కారణం అవుతుంది. మీలో ఈ లక్షణం ఉందో లేదో చెక్ చేసుకోవాలి.
* జీర్ణ సమస్యలు
కడుపు ఉబ్బరం, ఛాతీలో మంట, యాసిడ్ రిఫ్లక్స్ వంటి లక్షణాలు శరీరంలో ఆమ్లత్వాన్ని సూచిస్తాయి. స్టమక్ యాసిడ్స్ అతిగా విడుదలవడం, డైజేషన్ సరిగా లేకపోవడం వంటివి దీర్ఘకాలంలో గ్యాస్ట్రోఇంటెస్టైనల్ హెల్త్‌ని ప్రభావితం చేస్తాయి.
* తీవ్ర అలసట
బాడీలో ఆమ్లత్వం ఎక్కువైతే అది సెల్యులార్ ఎనర్జీ ప్రొడక్షన్‌పై ప్రభావం చూపిస్తుంది. శరీర కణాలకు ఆక్సిజన్ సరఫరాను అడ్డుకుని కణాల పనితీరును దెబ్బతీస్తుంది. ఫలితంగా, కణాలు త్వరగా అలసిపోతాయి. ఎనర్జీ ప్రొడక్షన్ కూడా సరిగా ఉండకపోవడంతో శరీరం అలసిపోతుంది. సరైన విశ్రాంతి తీసుకున్నా, నిద్ర పోయినా కూడా బాడీ తిరిగి యాక్టివేట్ కాదు. ఈ లక్షణం కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
* కీళ్ల నొప్పులు
ఎసిడిటీ కీళ్ల వాపును ఎక్కువ చేసి ఆర్థరైటిస్ వంటి ఎముకల వ్యాధి బారిన పడేలా చేస్తుంది. మోకాళ్లలో గుజ్జును కరిగించి గరుకుగా మార్చి అసౌకర్యాన్ని కలగజేస్తుంది. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో కార్టిలేజ్ తగ్గిపోయి దీర్ఘకాల కీళ్ల నొప్పులకు దారితీస్తుంది.
* కండరాల బలహీనత
కండరాల పనితీరుకు అవసరమయ్యే మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం వంటి కీలక మినరల్స్ సరఫరాని ఎసిడిటీ తగ్గిస్తుంది. ఫలితంగా, కండరాలు బలహీనమై ఏ చిన్న పనిచేసినా నొప్పి పుడుతుంది. తరచుగా తిమ్మిర్లు వస్తుంటాయి. మీలో ఇలాంటి సింప్టమ్ కనిపిస్తే జాగ్రత్త పడాలి.
* తరచూ తలనొప్పి
శరీరంలో ఆమ్లత్వం పెరిగిపోతే కణాలకు ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది. దీంతో పాటు మెదడుకు కావాల్సిన రక్త సరఫరా, ఆక్సిజన్ సరిగా అందదు. ఫలితంగా, తలనొప్పి, మైగ్రేన్ సమస్యలు వస్తాయి.
* చర్మ సమస్యలు
ఎసిడిటీ ఎక్కువ రోజుల పాటు కొనసాగితే మొటిమలు, పొడిబారడం, దద్దుర్లు వంటి చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. చెమటను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని తగ్గించి చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.
* బరువు తగ్గకపోవడం
ఎసిడిక్ బాడీలో మెటబాలిజం ప్రాసెస్, హార్మోన్ రెగ్యులేషన్ సరిగా జరగవు. ఫలితంగా, బాడీలో ఉన్న కొవ్వు త్వరగా కరగకుండా కొవ్వు కణాల్లో ఎక్సెస్ యాసిడ్ స్టోర్ అవుతుంది. దీంతో బరువు తగ్గడం కష్టతరమవుతుంది.
* దంత సమస్యలు
ఎసిడిటీ లెవెల్స్ ఎక్కువైతే నోటిలో హానికర బ్యాక్టీరియా పెరిగి దంత సమస్యలకు దారితీస్తుంది. దీంతోపాటు దంతాలపై ఉండే ఎనామిల్‌ని బలహీన పరచి క్యావిటీ, చిగుళ్ల వ్యాధులు, సెన్సిటివిటీకి కారణమవుతుంది.
* పెళుసైన గోర్లు, జుట్టు
గోర్లు, జుట్టు పెళుసుగా మారినా బాడీలో ఆమ్లత్వం ఎక్కువగా ఉన్నట్లే లెక్క. గోర్లకు, జుట్టుకు అందాల్సిన కీలక పోషకాలను ఇది అడ్డుకుని వాటిని బలహీనపరుస్తుంది. ఫలితంగా, జుట్టు పలచబడటం, విరిగి పోవడం, పెరుగుదల మందగించడం వంటివి ఎదురవుతాయి.