వాట్సప్‌లో యాడ్స్‌.. అప్‌డేట్స్‌ ట్యాబ్‌లో ఇకపై ప్రకటనలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వినియోగించే మెసేజింగ్ యాప్‌ వాట్సప్‌లో (Whatsapp) ఇకపై యాడ్స్‌ దర్శనమివ్వనున్నాయి.


యాప్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి యాడ్స్‌ లేకుండా, ఉచితంగానే సేవలందించిన ఈ సంస్థ.. ఆదాయ ఆర్జనలో భాగంగా కొత్తగా ప్రకటనలకు శ్రీకారం చుడుతోంది. ఇకపై యాప్‌లోని అప్‌డేట్స్‌ ట్యాబ్‌లో అడ్వర్టైజ్‌మెంట్‌కు సంబంధించిన ఫీచర్లు తీసుకొస్తున్నట్లు తన బ్లాగ్‌ పోస్ట్‌లో వాట్సప్‌ పేర్కొంది.

వాట్సప్‌లోని అప్‌డేట్స్‌ ట్యాబ్‌లో ఈ యాడ్స్‌కు సంబంధించిన ఫీచర్లు కనిపించనున్నాయి. అప్‌డేట్స్‌ ట్యాబ్‌లో ప్రస్తుతం ఛానెళ్లు, స్టేటస్ విభాగాల్లో ఇవి దర్శనం ఇవ్వనున్నాయి. యాప్‌ వాడేవారిలో 1.5 బిలియన్ల మంది రోజూ ఈ అప్‌డేట్స్‌ ట్యాబ్‌ను చూస్తుంటారని వాట్సప్‌ పేర్కొంది. ఈ నేపథ్యంలో అడ్మిన్లకు, ఆర్గనైజేషన్లకు, వ్యాపారులకు వాట్సప్‌ ద్వారా ఎదిగే అవకాశం కల్పించేందుకు ప్రకటనలు తీసుకొస్తున్నట్లు తెలిపింది. మొత్తం మూడు రకాల యాడ్‌ సంబంధిత ఫీచర్లు తీసుకొస్తున్నట్లు పేర్కొంది.

  • ఛానెల్‌ సబ్‌స్క్రిప్షన్‌: నెలవారీ ఫీజు చెల్లించి మీకు ఇష్టమైన ఛానెల్‌కు సపోర్ట్‌ చేయడం ఒకటి.
  • ప్రమోటెడ్‌ ఛానెల్‌: ప్రస్తుతం ఛానెల్స్‌ను ఎక్స్‌ప్లోర్‌ చేస్తే ట్రెండింగ్‌లో ఉన్న కొన్ని వాట్సప్‌ ఛానెళ్లు కనిపిస్తుంటాయి. ఇకపై అడ్మిన్లు తమ ఛానెల్‌ విజిబిలిటీనీ పెంచుకోవడానికి కొంత ఫీజును చెల్లించి ప్రమోట్‌ చేయొచ్చు.
  • స్టేటస్‌లో యాడ్స్: స్టేటస్‌లో ఇప్పటి వరకు వ్యక్తుల స్టేటస్‌లు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇకపై వ్యాపారాలకు సంబంధించిన స్టేటస్‌లు దర్శనమివ్వనున్నాయి.

అప్‌డేట్స్‌ ట్యాబ్‌కు మాత్రమే

యాడ్స్‌ కేవలం అప్‌డేట్స్‌ ట్యాబ్‌లో మాత్రమే కనిపిస్తాయి. పర్సనల్‌ చాట్స్‌ ఎప్పటిలానే యాడ్‌ఫ్రీగా ఉంటాయని వాట్సప్‌ పేర్కొంది. అంతేకాదు కాల్స్‌, మెసేజులు, స్టేటస్‌లు ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్టెడ్‌గా ఉంటాయని తెలిపింది. స్టేటస్‌లో చూపించే యాడ్స్‌, ఛానెళ్ల కోసం.. యూజర్‌ దేశం, సిటీ, భాష వంటి వివరాలు మాత్రమే సేకరిస్తామని పేర్కొంది. అడ్వర్టైజర్లకు వ్యక్తుల ఫోన్‌ నంబర్‌ను విక్రయించడం లేదా పంచుకోవడం చేయబోమని వాట్సప్‌ స్పష్టంచేసింది. ఎప్పటి నుంచి అందుబాటులోకి తెచ్చేదీ మాత్రం వెల్లడించలేదు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.