మధుమేహం ఏ ఒక్క వయస్సుకు పరిమితం కాదని, జీవితంలోని ప్రతి దశలోనూ ప్రజలను ప్రభావితం చేస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నొక్కిచెబుతుంది. ప్రపంచ దేశాల్లో ఈ వ్యాధితో బాధపడుతున్న వారిలో భారత్ రెండో స్థానానికి చేరుకుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వ్యాప్తి వేగంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. నవంబరు 14న ప్రపంచ మధుమేహ నివారణ దినాన్ని పురస్కరించుకొని డబ్ల్యూహెచ్‌వో పలు సూచనలు చేసింది. ఖమ్మం జిల్లాలో వ్యాధి వ్యాప్తి, కారణాలు, బాధితులకు అందుతున్న వైద్య సేవలపై ‘న్యూస్‌టుడే’ కథనం.
సమస్యను పట్టించుకోకుండా..
డయాబెటిస్‌ను ప్రధానంగా రెండు రకాలుగా విభజిస్తారు. టైప్-1 పిల్లలు, యుక్త వయస్కుల్లో కన్పిస్తోంది. టైప్-2 మధ్య వయస్కుల నుంచి పెద్దలపై ప్రభావం చూపుతుంది. ఆందోళనకరమైన విషయం ఏమిటంటే యువతలో కూడా టైప్-2లో బాధితుల సంఖ్య పెరుగుతుంది. పట్టణీకరణ, జీవనశైలిలో మార్పులే దీనికి కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా మంది యువత బీపీ, షుగర్ వ్యాధులను పట్టించుకోవడం లేదు. సరైన ఆహార నియమాలు పాటించకుండా అధిక కార్బోహైడ్రేట్లు కలిగిన ఆహారం తీసుకుంటున్నారు. పరీక్షలు చేయించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు లోనవుతున్నారు.
ఉచితంగా ఔషధాలు..
జిల్లాలో 234 ఆరోగ్య ఉపకేంద్రాలు, 26 పీహెచ్‌సీలు, 4 పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్(ఎన్‌సీడీ) ప్రోగ్రాంలో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. బాధితులను గుర్తించి చికిత్సలు అందించడంతోపాటు నెలకు సరిపడా ఔషధాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. సర్వజనాసుపత్రిలో ఎన్‌సీడీ క్లినిక్‌ను ఏర్పాటుచేసి ఓపీ సేవలతోపాటు మందులు సరఫరా చేస్తున్నారు.
30 ఏళ్ల పైబడిన యువత తప్పనిసరిగా తరచూ మధుమేహం పరీక్షలు చేయించుకోవాలి. శారీరక శ్రమ, వ్యాయామం, సమతుల్య ఆహారం తీసుకోవడం అత్యవసరం. చిన్నతనం నుంచే ఆరోగ్యకర అలవాట్లను ప్రోత్సహించడం ద్వారా దీర్ఘకాలిక మహమ్మారిని నియంత్రించవచ్చు.
































