టీచర్లకు ఏఐ పాఠాలు

వికసిత్‌ భారత్‌లో భాగంగా మానవ వనరుల అభివృద్ధిపై కేంద్రం దృష్టి పెట్టింది. దీనికోసం రాష్ట్రాల్లో వివిధ స్థాయిల్లో ఉన్న కోర్సులను రీడిజైన్‌ చేయాలని ఒత్తిడి చేస్తోంది.


దీంతో నైపుణ్యం గల మానవవనరుల కోసం అన్ని స్థాయిల కోర్సుల్లో సిలబస్‌ మార్పులు అనివార్యమైంది. ఫలితంగా పాఠశాల, ఇంటర్, ఉన్నత విద్య వరకూ సిలబస్‌ మార్పులపై దృష్టి పెట్టారు. దీనిపై ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ వి.బాలకిష్టారెడ్డి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. పాఠశాల విద్య నుంచి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) సిలబస్‌ అవసరమని ఇందులో పేర్కొన్నారు. దీనికోసం టీచర్ల నుంచి యూనివర్సిటీ ప్రొఫెసర్ల వరకూ వేసవి సెలవుల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వబోతున్నారు. ఇందుకు సంబంధించిన కసరత్తు వేగవంతం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈ నెలాఖరు కల్లా కేంద్రానికి రాష్ట్ర విద్యాశాఖ నివేదిక ఇవ్వాల్సి ఉంది.

కమిటీల ఏర్పాటు
పాఠశాల స్థాయిలో 9, 10 తరగతులు, ఇంటర్‌లో రెండు సంవత్సరాలు, డిగ్రీ, పీజీతో పాటు ఇంజనీరింగ్, పాలిటెక్నిక్‌ వంటి వృత్తి విద్యా కోర్సుల్లోనూ సిలబస్‌ను మార్చాలని నిర్ణయించారు. 20% సిలబస్‌ను ఏఐతో నింపాలని భావిస్తున్నారు. ఏయే చాప్టర్లు తొలగించాలి? ఏ స్థాయిలో ఎంతమేర ఏఐ సిలబస్‌ను తేవాలనేదానిపై విద్యాశాఖ అన్ని స్థాయిల్లో కమిటీలు వేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ విషయంపై మండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డితో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా గత రెండు రోజులుగా సమన్వయం చేసుకుంటున్నారు. టెన్త్‌ తర్వాత కొనసాగే పాలిటెక్నిక్, ఐటీఐల సిలబస్‌ను వచ్చే విద్యా సంవత్సరంలో 50 శాతం వరకూ మార్చాలనుకుంటున్నారు. అన్ని కమిటీలతో విద్యాశాఖ ఉన్నతాధికారులు వచ్చే వారం సమావేశమయ్యే అవకాశం ఉంది.

యూపీలోని కోర్సులపై దృష్టి
గత ఏడాది ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌)తో కలిసి ఉపాధి అవకాశాలు పెంచే కోర్సులను డిజైన్‌ చేసింది. దీన్ని తెలంగాణా అనుసరించాలని నిర్ణయించింది. టీసీఎస్‌తోపాటు అందుబాటులో ఉండే కొన్ని సంస్థలతోనూ అధికారులు చర్చించాలని భావిస్తున్నారు. అక్కడి కోర్సులు, సిలబస్‌ మార్పులపై జరిపిన సంస్కరణల్లో కొన్నింటిని గుర్తించారు.

-పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య వరకూ యూపీలో కమ్యూనికేషన్‌ మూల పాఠాల సామర్థ్యం, ఏఐ పరిచయంపై బోధకులకు 15 రోజులపాటు శిక్షణ ఇస్తున్నారు.
-యూపీలో ఏఐ ఫర్‌ రియల్‌ అప్లికేషన్, క్లౌడ్‌ కంప్యూటిగ్, వర్చువలైజేషన్, ఏఐ ఆప్టిమైజేషన్, ఏఐ ఆధారిత ఫిన్‌టెక్‌ లాంటి కోర్సులను తెచ్చారు. డేటాసైన్స్‌కు సంబంధించి ప్రొడక్టివ్‌ మోడల్స్, డేటా అనలిటిక్స్‌ వంటివీ ఉన్నాయి.
-యూపీ ప్రభుత్వం పాలిటెక్నిక్, ఐటీఐ, డిగ్రీ కోర్సుల్లో ఏఐ ట్రైనింగ్‌ కోసం ప్రత్యేక కోర్సులను డిజైన్‌ చేసింది. డిప్లొమా, డిగ్రీ, వ్యాపార నైపుణ్యం కోర్సులు ఇందులో ఉన్నాయి. వీటన్నింటినీ రాష్ట్ర విద్యాసంస్థల్లోకి తేవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.