సైబర్‌ సేఫ్టీపై విద్యార్థులకు పాఠ్యాంశం: అక్షయ్‌కుమార్‌ విజ్ఞప్తి

సామాన్యులతోపాటు సెలబ్రిటీలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లలో సైబర్‌ క్రైమ్‌ ఒకటి. మాయ మాటలు చెప్పో, ఇంకేదో చేసే బ్యాంకు ఖాతాల్లోని డబ్బు దోచుకోవటమే కాదు మన ఫొటోలను మార్ఫింగ్‌ చేసి, బ్లాక్‌మెయిల్‌ చేయడంలాంటివీ ఆన్‌లైన్‌ కేటుగాళ్లకు పరిపాటిగా మారింది. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులు, సెలబ్రిటీలు విజ్ఞప్తి చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌ (Akshay Kumar) సైతం తనవంతుగా సైబర్‌క్రైమ్‌పై పోరుకి దిగారు. ముఖ్యంగా చిన్నారుల విషయంలో సైబర్‌ మోసాలు ఎలా జరుగుతున్నాయో చెబుతూ.. తన కుమార్తె ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని పంచుకున్నారు. ముంబయి స్టేట్‌ పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో శుక్రవారం జరిగిన ‘సైబర్‌ అవేర్‌నెస్‌ మంత్‌ 2025’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు.


‘‘కొన్ని నెలల క్రితం ఇంట్లో జరిగిన చిన్న ఘటన గురించి చెప్పాలనుకుంటున్నా. నా కూతురు ఆన్‌లైన్‌లో ఓ గేమ్‌ ఆడుకుంటోంది. ‘నువ్వు ఆడా, మగా?’ అని ఓ అపరిచితుడి నుంచి మెసేజ్‌ వచ్చింది. నా కూతురు ఫిమేల్ అని రిప్లై ఇచ్చింది. ‘నీ న్యూడ్‌ ఫొటోలు పంపగలవా?’ అంటూ అతడు మరో మెసేజ్‌ చేశాడు. వెంటనే మా అమ్మాయి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసి, జరిగిందంతా వాళ్లమ్మకు చెప్పింది. ఇది కూడా సైబర్‌క్రైమ్‌లో భాగమే. దీనిని కట్టడి చేయడం ఎంతో అవసరం’’ అని పేర్కొన్నారు.  పాఠశాల విద్యార్థులకు సైబర్‌ క్రైమ్‌పై అవగాహన కల్పించేలా సైబర్‌ ఎడ్యుకేషన్‌ను వీక్లీ సబ్జెక్ట్‌గా పెట్టాలని ఈ సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.