“కాంతార చాప్టర్ 1 చూసి ఇండియన్ డైరెక్టర్లంతా సిగ్గుపడాలి” – ఆర్జీవీ

‘కాంతార చాప్టర్ 1’ సినిమా విడుదలై ప్రేక్షకుల ప్రశంసలు, భారీ వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. రిషబ్ శెట్టి స్వయంగా దర్శకత్వం వహించి హీరోగా నటించిన ఈ ప్రీక్వెల్‌పై ఇప్పటికే ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా, యష్, జూనియర్ ఎన్టీఆర్ వంటి ప్రముఖులు స్పందించి ప్రశంసలు కురిపించారు.


తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా తనదైన శైలిలో రివ్యూ ఇచ్చి రిషబ్ శెట్టి పై ప్రశంసల వర్షం కురిపించాడు.

అక్టోబర్ 3న ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆర్జీవీ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. “కాంతార ఛాప్టర్ 1 అద్భుతం. రిషబ్ శెట్టి, అతని టీమ్ బీజీఎం, సౌండ్ డిజైన్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, వీఎఫ్ఎక్స్‌లో చూపిన అద్భుతమైన ప్రయత్నం చూసిన తర్వాత.. భారత దేశంలో దర్శకులందరూ సిగ్గుపడాలి. కంటెంట్ ఒక బోనస్ మాత్రమే. కేవలం వారి కష్టానికి ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలవడానికి అర్హత ఉంది. హోంబలే ఫిల్మ్స్ క్రియేటివ్ టీమ్‌కు ఇచ్చిన స్వేచ్ఛకు హ్యాట్సాఫ్. రిషబ్ శెట్టి, మీరు గొప్ప దర్శకులా లేక గొప్ప నటులా అనే విషయంలో నేను కన్ఫ్యూజ్‌ అవుతున్నాను” అని వర్మ పేర్కొన్నాడు. తన పనికి లభించిన ఈ ప్రశంసలకు రిషబ్ శెట్టి వినయంగా స్పందించాడు. “నేను కేవలం సినిమా లవర్ మాత్రమే సార్. మీ ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు” అని ఆర్జీవీకి రిప్లై ఇచ్చాడు. ‘కాంతార చాప్టర్ 1’ అక్టోబర్ 2న కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్ సహా పలు భాషల్లో విడుదలైంది. 2022 లో వచ్చిన ‘కాంతార’ కథకు వెయ్యి సంవత్సరాల ముందు రోజుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రిషబ్ శెట్టితో పాటు రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో నటించారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.