ఐదు జిల్లాల్లో భూసేకరణ అధికారుల నియామకం
189.9 కి.మీ. పొడవున ఓఆర్‌ఆర్
23 మండలాలు.. 121 గ్రామాల మీదుగా నిర్మాణం
రెండు అనుసంధాన రహదారులు కూడా..
రాజధాని అమరావతికి వడ్డాణంలా భాసిల్లే.. మధ్య కోస్తా ప్రాంత సమగ్ర అభివృద్ధికి దోహదం చేసే అమరావతి ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్) నిర్మాణం దిశగా కీలక ముందడుగు పడింది. ఓఆర్‌ఆర్ భూసేకరణ అధికారులుగా ఐదు జిల్లాలకు ఐదుగురు సంయుక్త కలెక్టర్లను ప్రభుత్వం నియమించింది. కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, ఏలూరు జిల్లాల్లోని 23 మండలాల్లో, 121 గ్రామాల మీదుగా ఓఆర్‌ఆర్ వెళుతోంది. దీని మొత్తం పొడవు 189.9 కిలోమీటర్లు. ప్రస్తుతం ఉన్న కోల్‌కతా- చెన్నై జాతీయరహదారి నుంచి ఓఆర్‌ఆర్‌కి దక్షిణం, తూర్పు దిశల మధ్యలో రెండు అనుసంధాన రహదారులను నిర్మించనున్నారు. 189.9 కి.మీ. ఓఆర్‌ఆర్‌కు ఇటీవల ఆమోదం తెలిపిన ఎలైన్‌మెంట్ అప్రూవల్ కమిటీ.. విజయవాడ తూర్పు బైపాస్ అవసరం లేదని తేల్చేసింది. దానికి ప్రత్యామ్నాయంగా రెండు లింక్ రోడ్ల నిర్మాణానికి అవకాశం కల్పించింది. హైదరాబాద్‌లో గచ్చిబౌలి వైపు నుంచి ఓఆర్‌ఆర్‌కి అనుసంధానం ఉన్నట్లే.. చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారిలో విజయవాడ బైపాస్ మొదలయ్యే కాజ నుంచి తెనాలి సమీపంలోని నందివెలుగు వరకు 17 కి.మీ. మేర ఆరు వరుసల అనుసంధాన రహదారిని నిర్మించనున్నారు. దీని కోసం మూడు ఎలైన్‌మెంట్లను ఎన్‌హెచ్‌ఏఐ సిద్ధం చేసి, రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. గుంటూరు బైపాస్‌లో బుడంపాడు నుంచి నారాకోడూరు వద్ద ఓఆర్‌ఆర్ వరకు నాలుగు వరుసలుగా రహదారిని విస్తరిస్తారు. దీనికి మూడు ఎలైన్‌మెంట్లు సిద్ధం చేశారు.
తదుపరి కార్యాచరణ ఏంటి?
ఎన్‌హెచ్‌ఏఐ నుంచి వెళ్లిన ఓఆర్‌ఆర్ ఎలైన్‌మెంట్‌లో స్వల్ప మార్పుచేర్పులతో కూడిన ప్రతిపాదన, రెండు లింక్‌రోడ్ల ఎలైన్‌మెంట్‌ల ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపాక, వాటిని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (మోర్త్)కు పంపిస్తారు. అక్కడ తుది ఆమోదం తెలుపుతారు.
ఓఆర్‌ఆర్ భూసేకరణకు సర్వే నంబర్ల వారీగా నోటిఫికేషన్ జారీచేస్తారు. 21 రోజులు గడువిచ్చి, అభ్యంతరాలు తెలిపిన వారితో జేసీ.. సమావేశాలు నిర్వహించి వారి వినతులు వింటారు. వాటిని జేసీ, ఎన్‌హెచ్‌ఏఐ స్థాయిలో పరిష్కరిస్తారు.
అదే సమయంలో క్షేత్రస్థాయిలో జాయింట్ మెజర్‌మెంట్ సర్వే చేసి, పెగ్ మార్కింగ్ వేస్తారు.
జేసీ వద్ద అభ్యంతరాలన్నీ పరిష్కారమయ్యాక 3డి నోటిఫికేషన్ జారీచేస్తారు. అంటే ఆయా సర్వే నంబర్లలో భూములు కేంద్రం అధీనంలోకి వెళ్లినట్లవుతుంది.
ఆ తర్వాత 3జి3 నోటిఫికేషన్ ఇస్తారు. పరిహారం ఇచ్చేందుకు అవార్డు జారీచేస్తారు. ఏ సర్వే నంబరులో ఎంత భూమి ఉంది, ఎన్ని నిర్మాణాలున్నాయి, వాటి యజమాని ఎవరనేది అందులో ఉంటుంది.
అనంతరం భూసేకరణ నిధుల కోసం ఆ వివరాలు ఎన్‌హెచ్‌ఏఐకి పంపుతారు. ఆ సొమ్మును ఎన్‌హెచ్‌ఏఐ అందజేస్తే.. భూ యజమానులకు ఆన్‌లైన్‌లో చెల్లిస్తారు.
తర్వాత భూములను జేసీ తమ ఆధీనంలోకి తీసుకొని, ఎన్‌హెచ్‌ఏఐ పేరిట మ్యుటేషన్ చేస్తారు.
భూసేకరణ ప్రక్రియ జరుగుతుండగానే.. డీపీఆర్ సిద్ధం చేస్తూ, మరోవైపు వివిధ అనుమతులను ఎన్‌హెచ్‌ఏఐ ఇంజినీర్లు తీసుకోనున్నారు.
ఓఆర్‌ఆర్ వెళ్లే జిల్లాలు, మండలాలు, గ్రామాలు..
ఎన్టీఆర్ జిల్లాలో..
కంచికచర్ల మండలంలోని కంచికచర్ల, పెరెకలపాడు, గొట్టుముక్కల, మున్నలూరు, మొగులూరు, కునికినపాడు
వీరులపాడు మండలంలోని పొన్నవరం, జగన్నాథపురం, జుజ్జూరు, చెన్నారావుపాలెం, తిమ్మాపురం, గూడెం మాధవరం, అల్లూరు, నరసింహారావుపాలెం
జి.కొండూరు మండలంలోని జి.కొండూరు, కుంటముక్కల, దుగ్గిరాలపాడు, పెట్రంపాడు, గంగినేనిపాలెం, నందిగామ, కోడూరు
మైలవరం మండలంలోని మైలవరం, పొందుగుల, గణపవరం
ఏలూరు జిల్లాలో..
ఆగిరిపల్లి మండలంలోని బొడ్డనపల్లె, గరికపాటివారికండ్రిక, పిన్నమరెడ్డిపల్లి, నూగొండపల్లి, ఆగిరిపల్లి, చొప్పరమెట్ల, నరసింగపాలెం, సగ్గూరు, కృష్ణవరం, సురవరం, కల్లటూరు
కృష్ణా జిల్లాలో..
బాపులపాడు మండలంలోని బండారుగూడెం, అంపాపురం
గన్నవరం మండలంలోని సగ్గురు ఆమని, బల్లిపర్రు, బుతుమిల్లిపాడు
ఉంగుటూరు మండలంలోని పెద్దఅవుటపల్లి, ఆత్కూరు, పొట్టిపాడు, తేలప్రోలు, వెలినూతల, వెల్దిపాడు, తరిగొప్పుల, వేంపాడు, బొకినాల, మానికొండ
కంకిపాడు మండలంలోని మారేడుమాక, కోలవెన్ను, ప్రొద్దుటూరు, కొణతనపాడు, దావులూరు, చలివేంద్రపాలెం, నెప్పల్లె, కుందేరు
తోట్లవల్లూరు మండలంలోని రొయ్యూరు, చినపులిపాక, బొడ్డపాడు, నార్త్ వల్లూరు, సౌత్ వల్లూరు
గుంటూరు జిల్లాలో..
మంగళగిరి మండలంలోని కాజ, చినకాకాని
తాడికొండ మండలంలోని పాములపాడు, రావెల
మేడికొండూరు మండలంలోని సిరిపురం, వరగాని, మందపాడు, మంగళగిరిపాడు, డోకిపర్రు, విశదల, పేరేచర్ల, వెలవర్తిపాడు, మేడికొండూరు
పెదకాకాని మండలంలోని నంబూరు, దేవరాయబొట్లపాలెం, అనుమర్లపూడి
దుగ్గిరాల మండలంలోని చిలువూరు, కంఠంరాజు కొండూరు, ఈమని, చింతలపూడి, పెనుమూలి
కొల్లిపర మండలంలోని వల్లభాపురం, మున్నంగి, దంతలూరు, కుంచవరం, అత్తోట
తెనాలి మండలంలోని కొలకలూరు, నందివెలుగు, గుడివాడ, అంగలకుదురు, కఠేవరం, సంగం జాగర్లమూడి ః చేబ్రోలు మండలంలోని గొడవర్రు, నారాకోడూరు, వేజెండ్ల, సుద్దపల్లి, శేకూరు
వట్టిచెరుకూరు మండలంలోని కొర్నెపాడు, అనంతవరప్పాడు, చమళ్లమూడి, కుర్నూతల
గుంటూరు తూర్పు మండలంలోని ఏటుకూరు, గుంటూరు, బుడంపాడు ః గుంటూరు పశ్చిమ మండలంలోని పొత్తూరు, అంకిరెడ్డిపాలెం
పల్నాడు జిల్లాలో..
అమరావతి మండలంలోని లింగాపురం, ధరణికోట, దిడుగు, నెమలికల్లు
పెదకూరపాడు మండలంలోని ముస్సాపురం, పాటిబండ్ల, జలాల్‌పురం, కంభంపాడు, తాళ్లూరు, లింగంగుంట్ల, కాశిపాడు గ్రామాలు.