రాజమండ్రిలో అర్థరాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో నాలుగు బస్సులు ఒకదానికి ఒకటి ఢీకొనడంతో 26మంది గాయపడ్డారు. రెండు ట్రావెల్ బస్సులను విద్యార్థులతో కూడిన మరో రెండు బస్సులు ఢీకొనడంతో దివాన్చెరువు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ ప్రమాదంలో 26 మందికి పైగా విద్యార్థులు గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..తెలంగాణలోని నల్గొండ జిల్లా దిండి ప్రాజెక్టు సమీపంలో ఉన్న గుండ్లపల్లి గ్రామానికి చెందిన ప్రభుత్వ మోడల్ స్కూల్, కళాశాలకు చెందిన 9, 10వ తరగతి, ఇంటర్ విద్యార్థులు మూడు రోజుల క్రితం విహారయాత్రకు బయలుదేరారు.
మొత్తం 40 మంది బాలికలు, 40 మంది బాలురు, 10 మంది ఉపాధ్యాయులు, సిబ్బంది రెండు బస్సుల్లో అరకు, పాడేరు తదితర ప్రాంతాల్లో పర్యటన కోసం వచ్చారు. తిరిగి నల్గొండకు బయలుదేరే క్రమంలో అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకుని మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత రాజమండ్రి వైపు వస్తున్నారు. మరో రెండు ట్రావెల్ బస్సులతో పాటు విద్యార్థులతో కూడిన బస్సులు వరుసగా వెళుతున్న క్రమంలో దివాన్చెరువు పరిధిలో ఓ గేదె అడ్డు రావడంతో ముందు వెళ్తున్న ట్రావెల్ బస్సు డ్రైవర్ సడన్బ్రేక్ వేశాడు. దీంతో వెనుక వస్తున్న పిల్లల బస్సులు రెండు, మరో ట్రావెల్ బస్సు ఒకదానినొకటి ఢీకొన్నాయి. రెండు బస్సుల్లోని 26 మంది విద్యార్థులకు ఈ ప్రమాదంలో గాయపడ్డారు.
సమాచారం అందుకున్న హోంగార్డ్స్ డీఎస్పీ కిరణ్కుమార్, సీఐలు మంగాదేవి, సుమంత్, సిబ్బంది చేరుకొని పరిస్థితిని పర్యవేక్షించారు. అనంతరం గాయపడిన వారిని మూడు అంబులెన్స్ల్లో రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి, మిగిలిన విద్యార్థులను దివాన్చెరువులోని బాలవికాస్ మందిరానికి తరలించారు. వారికి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



































