తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం ప్రకటించింది. తాజాగా సంక్రాంతి వేళ ఉద్యోగులకు ఒక డీఏ విడుదల చేసిన ప్రభుత్వం.. బకాయిల విషయంలో గతంలో ఇచ్చిన హామీకి కట్టుబడి నిధుల ను జమ చేస్తున్నట్లు వెల్లడించింది.
అదే సమయంలో రిటైర్ అవుతున్న ఉద్యోగుల ప్రయోజనాలు దక్కే విధంగా నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. ఇక.. ఇప్పుడు కాంట్రాక్టు.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది.
తెలంగాణ లో పని చేసే కాంట్రాక్టు.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా సంక్రాంతి సమయంలో సీఎం రేవంత్ స్వయంగా డీఏ విడుదల పైన ప్రకటన చేసారు. దీని కారణంగా ప్రభుత్వం పైన రూ 227 కోట్ల మేర భారం పడుతుందని వివరించారు. తమ ప్రభుత్వం ఉద్యోగులకు ప్రతీ నెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తుందని… ప్రతీ ఉద్యోగికి రూ 1.02 కోట్ల మేర భీమా అమలు చేస్తున్నామని చెప్పకొచ్చారు. అదే సమయంలో క్రాంటాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రయోజనం కలిగేలా నిర్ణయం ప్రకటించారు. వారికి సైతం రెగ్యులర్ ఉద్యోగుల తరహాలోనే నేరుగా ప్రతీ నెలా ఒకటో తేదనే వారి బ్యాంకు ఖాతాల్లో జీతాలు జమ కానున్నాయి. ఏప్రిల్ నుంచి ఈ విధానం అమలు చేయాలని డిసైడ్ అయ్యారు.
కాగా, ప్రస్తుతం ఔట్ సోర్సింగ్.. కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా వేతనం అందుతోంది. ఏజెన్సీలకు ప్రభుత్వం చెల్లింపులు చేస్తే..ఆ ఏజెన్సీలు ఉద్యోగుల ఖాతాల్లో నెల వారీ వేతనం జమ చేసేవి. అయితే, కొన్ని ఏజెన్సీల తీరు పైన ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. కొన్ని ఏజెన్సీలు ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇచ్చే వేతనాల్లో కోత విధిస్తు న్నాయి. కొన్ని ఏజెన్సీలు నకిలీ ఉద్యోగులను సృష్టించి అక్రమంగా ప్రభుత్వం నుంచి వేతనాలు పొందుతున్నాయి. అదే సమయంలో ప్రభుత్వం జమ చేసే పీఎఫ్, ఈఎస్‌ఐ నిధులను కూడా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయటం లేదనే ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో ఇలాంటి అక్రమాలకు ముగింపు పలికేందుకు ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇక నుంచి థర్డ్ పార్టీ ప్రమేయం లేకుండా నేరుగా ప్రభుత్వమే వారి ఖాతాల్లో నగదు జమ చేయనుంది. దీని ద్వారా దాదాపు అయిదు లక్షల మందికి లబ్ది చేకూరనుంది.




































