భారత్ ఖాతాలో మరో పతకం.. కాంస్యం గెల్చుకున్న హాకీ జట్టు

www.mannamweb.com


ప్రతిష్ఠాత్మక పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. గురువారం (ఆగస్టు 08) జరిగిన కాంస్య పతక పోరులో భారత హాకీ జట్టు స్పెయిన్‌పై 2-1 తేడాతో విజయం సాధించింది. తద్వారా కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. తాజా పతకంతో పారిస్‌ ఒలింపిక్స్ లో భారత్‌ సాధించిన మొత్తం పతకాల సంఖ్య 4కి చేరింది. కాగా వరుసగా రెండో ఒలింపిక్స్‌లో భారత్‌కు కాంస్యం రావడం విశేషం. టోక్యో ఒలింపిక్స్‌లోనూ భారత్‌కు కాంస్య పతకం దక్కింది. సుమారు 47 ఏళ్ల తర్వాత భారత హాకీ జట్టు వరుసగా 2 ఒలింపిక్స్‌లో పతకాలు సొంతం చేసుకుంది. ఓవరాల్ గా ఒలింపిక్స్ లో హాకీ జట్టుకు ఇది 13వ పతకం. కాగా ఈ మ్యాచ్ తొలి క్వార్టర్‌లో భారత్, స్పెయిన్ జట్లు పోటా పోటీగా ఆడాయి. రెండు జట్ల ఆటగాళ్ళు గోల్స్ చేయడానికి గోల్ పోస్ట్ పై పదే పదే దాడులు చేశారు. అయితే ఇరు జట్ల డిఫెన్స్ కూడా బలంగా ఉండడంతో మొదటి క్వార్టర్ లో గోల్స్ ఏమీ నమోదు కాలేదు.

అయితే రెండో క్వార్టర్ ఆరంభంలోనే స్పెయిన్ మ్యాచ్‌లో తొలి గోల్ చేసింది. 18వ నిమిషంలో పెనాల్టీ స్ట్రోక్‌లో మార్క్‌ మిరల్స్‌ పోర్టిల్లో గోల్‌ చేశాడు. ఆ తర్వాత 20వ నిమిషంలో స్పెయిన్‌కు మరో పెనాల్టీ కార్నర్‌ లభించింది. అయితే దానిని గోల్‌గా మార్చలేకపోయాడు. ఆట 29వ నిమిషంలో భారత్‌కు పెనాల్టీ కార్నర్‌ లభించింది, కానీ ఇక్కడ కూడా గోల్‌ లేదు. ఆ తర్వాత ఈ అర్ధభాగం చివరి నిమిషంలో భారత్‌కు మరో పెనాల్టీ కార్నర్ లభించింది. ఈసారి భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ గోల్ చేసి మ్యాచ్‌ను 1-1తో సమం చేశాడు.

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌ ప్రయాణం

పారిస్ ఒలింపిక్స్‌లో న్యూజిలాండ్‌ను 3-2తో ఓడించి భారత్ తన పోరాటాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌ 1-1తో డ్రాగా ముగిసింది. మూడో మ్యాచ్‌లో భారత జట్టు 2-0తో ఐర్లాండ్‌పై విజయం సాధించింది. ఆ తర్వాత బెల్జియం చేతిలో 1-2తో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాను ఓడించడం ద్వారా భారత జట్టు చారిత్రాత్మక విజయం సాధించి పెనాల్టీ షూటౌట్‌లో బ్రిటన్‌ను 4-2తో ఓడించింది. కానీ సెమీ ఫైనల్లో భారత జట్టు 2-3 తేడాతో ఓడిపోయింది. ఇప్పుడు స్పెయిన్ ను చిత్తు చేసి కాంస్యం గెల్చుకుంది.
స్పెయిన్ పై ఘన విజయం..