ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం-విజయమ్మతో జేసీ ప్రభాకర్ రెడ్డి భేటీ..!

www.mannamweb.com


ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం-విజయమ్మతో జేసీ ప్రభాకర్ రెడ్డి భేటీ..!

ఏపీ రాజకీయాల్లో ఉప్పూ, నిప్పుగా ఉన్న రెండు కుటుంబాల ప్రతినిధులు ఇవాళ అనూహ్యంగా కలుసుకున్నారు. ఇందులో ఒకరు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మ కాగా.. మరొకరు టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి. హైదరాబాద్ లోని విజయమ్మ నివాసం లోటస్ పాండ్ కు వెళ్లిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఆమె ఆరోగ్య పరిస్ధితిపై ఆరా తీసారు. దాదాపు ఆరగంటసేపు భేటీ అయ్యాక తిరిగి వెళ్లిపోయారు.

గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. వైసీపీ విపక్షంలో ఉండగా జగన్ ను పదే పదే టార్గెట్ చేసేవారు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక జేసీ ప్రభాకర్ రెడ్డిని, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని జగన్ సర్కార్ పూర్తిగా టార్గెట్ చేసింది. రవాణా వాహనాల స్కాంలో పెద్ద ఎత్తున కేసులు కూడా నమోదు చేసింది. అప్పట్లో ఎమ్మెల్యేగా పోటీ చేయని జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. అయినా వైసీపీ వేధింపులు మాత్రం ఆగలేదు. తాజాగా కూటమి సర్కార్ లో ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలిచారు.

ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా జగన్ తల్లి విజయమ్మను జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి మరీ కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అదీ ఇరు కుటుంబాల మధ్య ఎప్పటి నుంచో వైరం కొనసాగుతున్నప్పటికీ.. జేసీ లోటస్ పాండ్ కు వెళ్లి విజయమ్మను పరామర్శించి రావడం వెనుక ఏముందనే చర్చ సాగుతోంది. ప్రస్తుతం జేసీ అధికారంలో ఉండగా.. జగన్, షర్మిల విపక్షంలో ఉన్నారు. ఇలాంటి సమయంలో విజయమ్మను పరామర్శించేందుకు వెళ్లడం ద్వారా సొంత పార్టీ పెద్దలకు ఆయన ఏదైనా సంకేతాలు ఇస్తున్నారా అన్నది తేలాల్సి ఉంది.