కొంతమంది ఓటుని చాలా పవిత్రమైన హక్కుగా భావిస్తారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఓటు వేసి తీరతారు. అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంటారు.
బాపట్ల జిల్లా కారంచేడుకు చెందిన గర్నెపూడి చిట్టెమ్మ కూడా ఆ కోవకు చెందుతారు. చిట్టెమ్మ భర్త సింగయ్య(62) పోలింగ్ రోజైన సోమవారం చనిపోయారు. అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో చిట్టెమ్మ దుఃఖంలో మునిగిపోయారు. అయినప్పటికీ బాధను దిగమింగుకుని పోలింగ్ బూత్‌కు వెళ్లి ఆమె ఓటు వేశారు. 178వ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కుని వినియోగించుకున్నారు. తద్వారా ప్రజాస్వామ్యంలో ఓటు విలువను ఆమె చాటి చెప్పారు.
కాగా గ్రామంలో చిట్టెమ్మ వీవోఏగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఓటుపై అవగాహన ఉన్న ఆమె దుఃఖంలోనూ వెళ్లి ఓటు వేయడం అందరికీ ఆదర్శప్రాయమంటూ అభినందనలు వెల్లువెత్తున్నాయి.